Private Colleges Fee Issue in Telangana : రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు పరీక్ష ఫీజు కట్టించుకోడానికి.. చెల్లించాల్సిన కాలేజీ ఫీజులకు లంకె పెడుతున్నాయి. గతంలో హాల్‌టికెట్లు ఇచ్చేటప్పుడు.. ఫలితాలు వచ్చిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వాల్సినప్పుడు బకాయిల వసూలుకు చివరి అవకాశాలుగా భావించేవి. హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఇవ్వడంతో పలు కళాశాలలు పరీక్ష ఫీజు తీసుకోవడం దగ్గరే తిరకాసు పెడుతున్నాయి. కళాశాలల నుంచే ఈ రుసుం చెల్లించాల్సి ఉండటంతో షరతులు విధిస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతులే కదా.. కొంత ఫీజు తగ్గించాలని తల్లిదండ్రులు అడిగితే ప్రభుత్వం నుంచి ఏమైనా జీవో ఉందా అని ప్రశ్నిస్తున్నాయి.
Exam Fee Issue in Telangana : నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ శిక్షణ సంస్థలో ఇంటర్ ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి వార్షిక ఫీజులో చాలా వరకు ఇప్పటికే చెల్లించాడు. మిగిలిన మొత్తం ఇవ్వకుంటే పరీక్ష ఫీజు తీసుకునేది లేదని ఆ సంస్థ సిబ్బంది విద్యార్థి తండ్రికి ఫోన్ చేశారు. దాంతో చేసేదేమీ లేక ఆయన మొత్తం ఫీజును అప్పటికప్పుడు చెల్లించారు. వాస్తవానికి ఆ విద్యాసంస్థకు ఇంటర్‌బోర్డు నుంచి అనుబంధ గుర్తింపు లేదు. ఆ సంస్థ ఇంటర్ విద్యను బోధిస్తే పరీక్ష ఫీజును మాత్రం మరో గుర్తింపు ఉన్న జూనియర్ కళాశాల పేరు మీద తీసుకుంటోంది. అంటే ఆ విద్యార్థి చదివేది ఒక కళాశాల కాగా.. రికార్డుల్లో మాత్రం మరో కళాశాలలో చదివినట్లు చూపుతారు.
Fee issue in Telangana Colleges : హైదరాబాద్ సంతోష్‌నగర్‌లో ఓ విద్యార్థి ఇంటర్ సీఈసీ సెకండియర్ చదువుతున్నాడు. ‘‘వాస్తవానికి గత ఏడాది రెండు నెలలే ప్రత్యక్ష తరగతులు జరిగాయి. ఈ సారీ ఆన్‌లైన్ తరగతులకే హాజరవుతున్నాడు. అధ్యాపకులను చాలా వరకు ఉద్యోగాల నుంచి తొలగించారు. ఖర్చులు తగ్గాయి. ఫీజు తగ్గించండి’’ అని ఆ విద్యార్థి తండ్రి కళాశాల యాజమాన్యాన్నికోరగాఅంగీకరించలేదు.
Exam Fee Problems in Telangana : వాస్తవానికి పరీక్ష ఫీజు ఇంటర్ ప్రథమ రెగ్యులర్ ఆర్ట్స్, సైన్స్ గ్రూపులకు రూ.490, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్‌కు రూ.490, సైన్స్ గ్రూపులకు (ప్రాక్టికల్స్ ఉన్నందున) రూ.690 తీసుకోవాలి. కొన్ని కళాశాలలు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొందరు ఇంటర్‌బోర్డు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు తుది గడువు ఫిబ్రవరి 4వ తేదీ.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!