‘దేశంలో మిగతా ప్రాంతాల్లో బలంగా, పటిష్ఠంగా ఉన్న భాజపా దక్షిణాదిలో అలా ఎందుకు ఎదగలేకపోతోందో విశ్లేషించుకోవాలి. అణగారిన, నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు చేరువకావాలి. అందుకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకుసాగాలి’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో భాజపాకు ఆదరణ లభిస్తోందని..దీన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ, కేరళ సహా ఆంధ్రప్రదేశ్‌లపై దృష్టి పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. హైదరాబాద్‌లో రెండ్రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం ముగింపు ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు, సూచనలు చేశారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఇతర రాష్ట్రాల సీనియర్ నేతలు తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లి రెండ్రోజుల పాటు అక్కడే ఉండేలా చేసిన కొత్త ప్రయోగాన్ని ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించాలని..ఈ పద్ధతి పార్టీకి లాభిస్తుందని మోదీ పేర్కొన్నారు. తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టినట్లుగానే కేరళలో పార్టీపరంగా వర్క్‌షాప్‌లు, రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే భారీ కార్యక్రమం నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. కరోనా తర్వాత చాలా ఉత్సాహంతో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
‘‘అధికారంలో లేకున్నా తెలంగాణ, కేరళ, బెంగాల్‌లలో పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, నిజాయతీగా పోరాటం చేస్తున్నారు. వారికి అభినందనలు. తెలంగాణలో భాజపా పలుచోట్ల ముందుకు వెళ్లింది. అంతటా ముందుకెళ్లాలి. వారసత్వపార్టీలకు మనుగడ లేదు. వాటిపై ప్రజల్లో విరక్తి కలిగింది. ప్రజలతో మమేకం కావాలి. దేశంలో మిగతా పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఆ విషయంలో భాజపాయే ముందుంది. మనకు కార్యకర్తలే బలం. కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి. జాతీయ నాయకత్వం నుంచి ఏ సహకారం కావాలో.. ఏ నాయకుడిని పంపాలో చెప్పండి. పెద్ద నాయకులు జిల్లాలు, నియోజకవర్గాలకు వెళ్తే ప్రభావం ఉంటుంది.మైనార్టీల్లో నిర్లక్ష్యానికి గురైన ఓ సామాజికవర్గం సమస్యలపై దృష్టి పెట్టి వారి ఆదరణ పొందడమే ఉత్తర్‌ప్రదేశ్ ఉపఎన్నికల్లో రెండు లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించడానికి కారణం. ఇలా నిర్లక్ష్యానికి గురైనవారు అన్ని రాష్ట్రాల్లో, అన్ని మతాల్లో ఉంటారు. వారిని గుర్తించి, సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలి. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలు బాగా చేయాలి. పలు పార్టీలు తమ అస్తిత్వం కోసమే పోరాడుతున్నాయి.
కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని కాపాడేలా తెలంగాణలో వ్యాక్సిన్ పరిశోధనలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్‌సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే జాతీయ పశువుల జీవవైద్య పరిశోధనల కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది.గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ప్రోత్సహించేందుకు మాతృభాషలో సాంకేతిక, వైద్య విద్యను బోధించేలా నిర్ణయం తీసుకున్నాం. - విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ
నిష్టతో ఉంటే మంచి ఫలితాలు
ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు, సమస్యను ఎదుర్కొన్నప్పుడు కొందరు విమర్శలు చేస్తుంటారు. మనం చేసే పనిలో, విధానాల రూపకల్పనలో నిష్టగా వ్యవహరించాలి. అదే మనకు శ్రీరామరక్ష. ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు నిష్టతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. కొవిడ్ ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మహమ్మారిని ఎదుర్కొనేందుకు దశలవారీ విధానాన్ని అనుసరిస్తే సమర్థంగా వ్యవహరించట్లేదంటూ కొందరు విమర్శలు చేశారు. కానీ కేంద్రం అనుసరించిన సమగ్ర విధానం ఫలితాన్నిచ్చింది. కరోనాను కట్టడి చేశాం. ప్రజలందరికీ టీకాలు అందించాం. ఇతర దేశాలకూ అందించగలిగాం. విమర్శలు చేసిన వారి మాటలు విని ఉంటే ఇబ్బంది పడేవాళ్లం. మనం చేసిన మంచి పనుల్ని ప్రజలకు పదేపదే వివరించాలి’ అని ప్రధాని మోదీ సూచించారు.
అభివృద్ధి ఫలాలు ఆఖరి పౌరుడి వరకు..
‘అంతర్జాతీయంగా దేశం చాలా పటిష్ఠంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిపాలన, సేవాభావంతో పనిచేయడమే కారణం. అభివృద్ధి ఫలాలు దేశంలో ఆఖరి పౌరుడి వరకు అందడమే లక్ష్యంగా ఉండాలి. హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేయడం ద్వారా ‘వన్ ఇండియా’ని అందించారు. నాటి చర్య, పటేల్ స్ఫూర్తితో ‘ఒకే దేశం..’ నినాదాన్ని ముందుకు తీసుకెళుతున్నాం..’అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని తన ప్రసంగంలో హైదరాబాద్‌ను భాగ్యనగరంగా పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రధాని మోదీవి కల్లబొల్లి మాటలే..భాజపాపై రాష్ట్ర మంత్రుల ధ్వజం
Revanth Reddy : 'ప్రధాని మోదీ ఉపన్యాసాలతో.. శబ్ద కాల్యుషం తప్ప ఒరిగిందేమీ లేదు'