వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీలోని గుంటూరు నుంచి సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా గుంటూరు జిల్లా జైలు వద్దకు పోలీసులు చేరుకొని ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు. కొద్ది సేపటి క్రితమే ఆయన్ను గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌కు రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ దగ్గర ఉండి పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సీఎస్‌కు ఈ-మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు ఆదేశాలు అందాయి. దీంతో రఘురామను రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఎంపీ రఘురామకృష్ణ రాజు కారెక్కుతూ మీడియాకు అభివాదం చేశారు.
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీఎస్ పర్యవేక్షణలో ఆయన్ను తరలిస్తున్నారు. ఈ నెల 21 వరకు ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం. సీఎస్ సహా నలుగురు అధికారులకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుంచి మెయిల్, ఫోన్ వచ్చినట్టు సమాచారం. దీంతో రఘురామ తరలింపుపై సీఎస్ తెలంగాణ అధికారులతోనూ సంప్రదించారు.