Prashant Kishor : రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఓవైపు దిల్లీ కాంగ్రెస్‌తో స్నేహహస్తం అందిస్తూనే మరోవైపు తెలంగాణలో తెరాసతో పీకే కలిసి పనిచేస్తారనే వార్తలు గందరగోళానికి దారితీశాయి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ ట్వీట్లు చర్చకు దారితీశాయి. ‘నీ శత్రువుతో ఎవరైతే స్నేహం చేస్తారో వారిని ఎప్పుడూ నమ్మలేం’ అని ఒక ట్వీట్‌లో పేర్కొనగా, ‘చివరివరకు ఆశ వదులుకోవద్దు’అంటూ మరొక ట్వీట్ చేశారు.
తెరాసతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసేది వెళ్లేది లేదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరాలంటే ఏ రాష్ట్రంలోనూ... కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో వ్యాపార ఒప్పందాలు ఉండరాదని అధిష్ఠానం నిబంధన పెట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా తెరాసతో తెగదెంపుల కోసమే పీకే హైదరాబాద్ వచ్చారని రేవంత్ స్పష్టం చేశారు. పీకే, కేసీఆర్ భేటీపై జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొట్టిపారేశారు. మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌లో తప్పేముందన్న భట్టి... పీకే అంశం అధిష్ఠానం పరిధిలో ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, తెరాస ఒక్కటేనని పీకే వ్యవహారంతో రుజువైందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్ని పార్టీలు ఏకమైనా మోదీని ఏమి చేయలేరని... మూడోసారి కూడా భాజపాదే అధికారమని స్పష్టం చేశారు. పీకే, కేసీఆర్ వ్యుహాలు తెలంగాణలో వర్కవుట్ కావని చెప్పారు. మొన్నటి వరకు భాజపా, కాంగ్రెస్ యేతర ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ ప్లాన్ చేశారని... పీకేతో భేటీ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేలా ప్రణాళికలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, తెరాసవి చీకటి ఒప్పందాలని.. ప్రజలకు వాస్తవాలు అర్థమతున్నాయని చెప్పారు.
రాజకీయ వ్యవస్థలో మారుతున్న సమీకరణాల మేరకు ఏదైనా జరగొచ్చని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెరాస ఎవరిపై ఆధారపడబోదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఒంటిరిగానే పోటీచేశామని తెలిపారు. ఇకముందూ పోత్తుల్లేకుండానే బరిలోకి దిగుతామని వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ వ్యవహారంపై అధిష్ఠానం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే స్పందించాలని రాష్ట్ర కాంగ్రెస్‌లో పలువురు నేతలు భావిస్తున్నారు.
సంబంధిత కథనాలు:
పార్టీలో చేరే వరకే పీకే వ్యూహకర్త... ఆ తర్వాత కాంగ్రెస్ కార్యకర్త: రేవంత్ రెడ్డి
పీకేకు కాంగ్రెస్ షరతు.. అందుకు ఓకే అంటేనే పార్టీలోకి.. తెరాస, వైకాపాతో కటీఫ్?