ప్రకాశం జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలో వ్యవసాయం అంతంతమాత్రమే. ఒక వైపు కొండలు, మరో వైపు రాళ్లగుట్టలు ఉన్న నేలలో.. భూగర్భ జలాలు తక్కువే. కరవు జిల్లాలో వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితి. అలాంటి నేలలో ఓ మహిళా రైతు సిరులు పండిస్తున్నారు. ఆమే నాగ దుర్గాభవాని. ఉపాధ్యాయ శిక్షణ తీసుకొని, ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో ఉద్యోగం చేస్తూ వ్యవసాయంపై ఇష్టంతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు.
అంతర పంటలు కూడా
ఎన్నాళ్ల నుంచో సాగు చేయక వృథాగా పడిఉన్న నేలలో పంటలు పండించడంపై స్థానిక వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సలహాలు, యూట్యూబ్ వీడియోల సాయంతో సాగు ప్రారంభించారు. నీటి వసతి అంతంతమాత్రమైన ప్రకాశం జిల్లాలో తక్కువ నీటితో సాగయ్యే కొత్తరకం పంటలు గురించి తెలుసుకున్నారు దుర్గాభవాని. జిల్లా పరిస్థితులకు డ్రాగన్ ఫ్రూట్ సరిగ్గా సరిపోతుందన్న సలహాతో ఆ పంట సాగు చేశారు. దాదాపు 3 ఎకరాల్లో పంట వేశారు. సిరి చందనం, జామ వంటి అంతర పంటలు సాగు చేశారు. భూగర్భ జలాలు తక్కువుగా ఉండటం వల్ల ఫాం ఫాండ్ నిర్మించుకొని నీటిని నిల్వ చేశారు. బిందుసేద్యం ద్వారా తక్కువ నీటిని సమర్థంగా వినియోగిస్తూ... లాభాలు పొందుతున్నారు.
అధికారుల సాయంతో
వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అనుకూలతను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. నిత్యం పొలంలో ఉంటూ సాగు పనులు సొంతంగా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కొత్త పంటలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుందని, సాగుపై అభిలాష ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ఈ అంటున్నారు నాగదుర్గా భవాని.
ఇదీ చదవండి : మూగజీవే కానీ ప్రేమజీవి.. అంతిమయాత్రలో మేక!