Prakash Raj With KCR: సీఎం కేసీఆర్ ముంబయి పర్యటనలో భాగంగా మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. జాతీయ రాజకీయాలపై లోతుగా చర్చించారు. కాగా.. ఈ పర్యటనలో అందరి చూపు ఇప్పుడు నటుడు ప్రకాశ్‌రాజ్‌పై పడింది. ముంబయికి ఆహ్వానించిన ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయి.. అటునుంచి అటు శరద్‌పవార్‌ను కలిసేందుకు సీఎం కేసీఆర్ వెళ్తున్నట్టు అందరికి తెలుసు. ఈ పర్యటనలో భాగంగా.. కొంత మంది ఆయా పార్టీల నాయకులు వెంట ఉంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. అనూహ్యంగా ఈ పర్యటనలో ప్రకాశ్‌రాజ్ మెరవటం.. అందరి దృష్టిని ఆకర్షించింది.

మొదటి నుంచి కేసీఆర్ వెంటే..
సీఎం కేసీఆర్ ముంబయికి రాగా.. గ్రాండ్ హయాత్‌లో ప్రకాశ్‌రాజే స్వయంగా సాదర స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి కేసీఆర్ వెంటే వెళ్లారు. వాళ్లతో భేటీ అయ్యారు. అటు నుంచి శరద్‌పవార్‌ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా కేసీఆర్ వెంటే ఉన్న ప్రకాశ్‌రాజ్.. వారితోనూ సమావేశమయ్యారు. భేటీల తర్వాత నిర్వహించిన మీడియా సమావేశాల్లోనూ పాల్గొన్నారు కూడా. అన్ని ముగించుకుని తిరిగి హోటల్‌కు వెళ్తున్నప్పుడు సైతం.. కేసీఆర్ కాన్వాయ్‌లోనే ప్రకాశ్‌రాజ్ వెళ్లారు. స్వాగతం పలకటం దగ్గర్నుంచి వీడ్కోలు వరకు ఈ పర్యటనలో మొత్తం కేసీఆర్ వెంటే ప్రకాశ్‌రాజ్ ఉన్నారు.

అప్పటి నుంచి భాజపాకు వ్యతిరేకంగానే..
మొదటి నుంచి ప్రకాశ్‌రాజ్.. భాజపాకు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారు. 2017లో గౌరీలంకేశ్ ఘటన జరిగినప్పటి నుంచి ప్రకాశ్‌రాజ్ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్(#JUSTASKING) అనే హాష్‌ట్యాగ్‌తో తన ప్రశ్నలను ఎప్పటికప్పుడు సంధిస్తూనే ఉన్నారు. 2019లో బెంగళూరు పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలా ఎప్పటికప్పుడు భాజపా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రకాశ్‌రాజ్.. ఇవాళ్టి కేసీఆర్ పర్యటనలో ఎవరూ ఊహించకుండా మెరవటం చర్చనీయాంశంగా మారింది.

అందుకే కేసీఆర్‌తో భేటీ..
కేంద్రంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరగటం.. దేశంలో ఉన్న సమస్యలపై గళమెత్తటం.. కేంద్రంలో భాజపా, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని తీసుకురావలన్న ప్రతిపాదన.. అందుకోసం ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు పూనుకోవటం.. లాంటి అంశాలు ప్రకాశ్‌రాజ్‌ను ఈ భేటీల్లో పాల్గొనేలా చేసుంటాయి! రాజకీయంగా కేసీఆర్ వ్యూహాలు.. తన రాజకీయ ఆలోచనలకు దగ్గరగా ఉన్నట్టు భావించటం వల్లే తనను కలిసుండవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. భాజపాపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్‌ను కలిసేందుకు.. జాతీయ రాజకీయాల్లో రావాల్సిన మార్పుల గురించి చర్చించేందుకు ఇదే అనువైన సమయంగా ప్రకాశ్‌రాజ్ భావించి ఉంటారని భావిస్తున్నారు!

ఇవీ చూడండి: