ఆలోచించే మనసు ఉండాలే కానీ...ఎలాంటి సమస్యకైనా అద్భుతమైన పరిష్కారం చూపించొచ్ఛు అందుకు లఖ్‌నవూకి చెందిన పూజారాయ్ ఓ చక్కటి ఉదాహరణ. చిన్నప్పటి నుంచీ సామాజిక సమస్యలపై అవగాహన ఎక్కువే. దానికితోడు సృజనాత్మకమైన ఆలోచనలూ చేసేది. అవి ఓ గొప్ప మలుపు తిరగడానికి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీజం పడింది. 2014లో ఆర్కిటెక్చర్ చదివేందుకు క్యాంపస్‌లో అడుగుపెట్టింది. అక్కడే దిశా సీమా కేర్ సెంటర్ ఉండేది. నిరుపేద చిన్నారులకు చదువు చెప్పే బడి అది. అక్కడి పిల్లలంతా పాఠశాల అయిపోయాక రాళ్లు, కర్రలు, తెగిపోయిన చెప్పులతో ఆటలాడుకోవడం గమనించింది.
స్కూలు పరిస్థితి గురించి ఆరా తీస్తే వారికి క్రీడాపరికరాలు కానీ, ప్రత్యేకంగా మైదానం కానీ లేవని చెప్పారు నిర్వాహకులు. వారికోసం ఏదైనా చేయాలనుకుంది. అయితే చేసే పని వారికి ఎక్కువకాలం ఫలితం ఇవ్వాలని ఆలోచించింది. స్నేహితులతో చర్చించి వృథా వస్తువులతో క్రీడా పరికరాలు, ఇతర వస్తువులు తయారు చేసి ఓ క్రీడామైదానాన్ని సృష్టించాలనుకుంది. అయిదురోజుల్లోనే వృథా టైర్లు, ఖాళీ డ్రమ్ములను సేకరించి అనుకున్నది చేసేసింది. అప్పుడు వారి ముఖాల్లో సంతోషం చూసి సంబరపడిపోయింది. అది మొదలు కోర్సు పూర్తయ్యే వరకూ తన క్యాంపస్‌కి దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలల్ని, సంక్షేమ గృహాల్నీ గుర్తించి వాటికీ ఈ సౌకర్యాన్ని అందించింది.
ఉద్యోగం చేస్తూనే...
చదువైపోయాక బెంగళూరులోని ఓ కార్పొరేట్ సంస్థలో నెలకు లక్షాపాతికవేల రూపాయల జీతానికి ఉద్యోగంలో చేరింది పూజ. వారాంతాల్లో సమీప ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన సదుపాయాల్ని మెరుగుపరచడం మొదలుపెట్టింది. ఇందుకు అయ్యే ఖర్చూ తానే భరించింది. అయితే అటు ఉద్యోగాన్నీ, ఇటు సేవాకార్యక్రమాల్నీ ఒకే సమయంలో చేయడం ఆమెకు కష్టంగా మారడంతో ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకుంది.
అమ్మానాన్నల్ని ఒప్పించి...
మంచి ఉద్యోగం వదులుకుని...ఎన్జీఓ ఏర్పాటు చేస్తాను అంటావు. నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా అని కోప్పడ్డారు ఇంట్లోవాళ్లు. కానీ ఆమె మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. వారిని ఒప్పించింది. తాను ఉద్యోగం చేసి సంపాదించుకున్న మొత్తం ఆరులక్షల రూపాయలతోనే ‘యాంట్‌హిల్ క్రియేషన్స్’ పేరుతో ఎన్జీవోను స్థాపించింది. ‘ఉద్యోగం వదిలేసినందుకు మొదట అమ్మ కోప్పడినా...ఇప్పుడు నా సేవలను గుర్తించింది. ఇప్పుడు నన్ను చూసి గర్వపడుతోంది. పిల్లల్లో ఆటల ద్వారానే మెదడు అభివృద్ధి చెందుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఆడుకోవడం పిల్లల హక్కు అని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది కూడా. ఆడుకునే అవకాశం, తగిన స్థలం లేకపోతే అది వారిపై మానసికంగా చెడు ప్రభావం చూపుతుంది. డ్రాప్‌అవుట్స్, ఫెయిల్ అవడం, తరగతిలో అల్లరి ఎక్కువగా చేయడానికి కారణం ఆటలు లేకపోవడమే. వారిలోని శక్తి, ఉత్సాహాన్ని సరైన దిశగా మార్చగలగాలి. అది క్రీడల ద్వారానే వీలవుతుంది. అందుకే ఈ మైదాన నిర్మాణాలు’ అని చెబుతోంది పూజ.
పదేళ్ల గ్యారంటీ...
ఈ బృందంలో 20 మంది సభ్యులున్నారు. ఈ బృందం ఏయే ప్రాంతాల్లో మైదానాల ఆవశ్యకత ఉందో ముందుగా గుర్తించి, సదరు స్థానిక నేతలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదిస్తారు. దానికంటే ముందు వయసుల వారీగా చిన్నారుల అభిప్రాయాల్నీ సేకరిస్తారు. పాఠశాలల్లోనే కాకుండా, పలు ఎన్జీవోలు, ఆసుపత్రుల బయట, బస్తీలో, గ్రంథాలయ ప్రాంగణాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ‘టైర్లు తయారుచేసే సంస్థలు, గ్యారేజ్, గోదాముల నుంచి వృథాను సేకరిస్తాం. ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు తదితర 17 రాష్ట్రాల్లో మూడొందలకుపైగా క్రీడామైదానాలను నిర్మించాం. తెలంగాణాలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఆంధ్ర ప్రదేశ్‌లోని వైజాగ్‌లో ఈ తరహా నిర్మాణాలు చేశాం. ఇవి కాక ప్రస్తుతం ఆంధ్రలో నాడు-నేడు ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని మైదానాలను నిర్మించనున్నాం. ఒక్కొక్కదాని నిర్మాణానికి అయిదురోజులు పట్టగా, రెండు లక్షలరూపాయలు ఖర్చు అవుతుంది. పదేళ్లైనా ఇవి చెక్కుచెదరవు. టాటా స్టీల్, బ్రిటానియా, సిడ్కో సంస్థలు చేయూతనందిస్తున్నాయి.’ అని చెబుతోంది పూజ.
‘ప్లే ఇన్ ఏ బాక్స్’ పేరుతో వెయ్యి రూపాయల ఖరీదు చేసే రకరకాల బొమ్మలు సహా ఆరు రకాల ఆటలు ఉండే పెట్టెను ప్రభుత్వ పాఠశాలల చిన్నారులకు ఉచితంగా అందిస్తోంది పూజా. ఈ గేమ్స్, బొమ్మలను డిజైన్ చేయడానికి ప్రత్యేక బృందమే ఉంది. ఒడిశా, గుజరాత్, బెంగళూరు, హైదరాబాద్‌లో ఎనిమిది పాఠశాలలకు చెందిన వేలాదిమందికి ఈ బాక్స్‌లు చేరాయి.