బయట లాక్‌డౌన్ ఉన్నా సరే... ఆర్డర్ చేస్తే చాలు ఇంటికే భోజనాన్ని సరఫరా చేసే డెలివరీ బాయ్స్ ఆందోళన చెందుతున్నారు. రెండో దశ లాక్డౌన్లో డెలివరీబాయ్స్కు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వగా... నేటి నుంచి అనుమతులు లేవంటూ పోలీసులు ఎక్కడికక్కడే ఆపేస్తున్నారు. వాహనాలను కూడా సీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఊరుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారికి, ఆహారం దొరకని వారికి ప్రతి రోజు ఆహారం అందిస్తూ తాము కూడ సేవ చేస్తున్నామని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు ముందుస్తూ హెచ్చరికలు ఏమీ చేయకుండా అనుమతులు లేవంటూ రోడ్డు మీద వాహనాలను సీజ్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
వారం రోజులుగా తాము ఆహారం సరఫరా చేస్తున్నామని... ఈరోజు మాత్రమే ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నట్లు డెలివరీ బాయ్స్ వాపోతున్నారు. అనుమతులు లేవని తెలిస్తే... తాము ఎందుకు వస్తామంటున్నారు. ఇప్పుడు ఉన్నపళంగా వాహనాలు తీసుకొని సీజ్ చేస్తే... ఏం చేయాలని అడుగుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఒకసారి అలోచించి తమ వాహనాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం తమ వాహనాలు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని అడిగినా పోలీసులు చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు... ఫుడ్ డెలివరీ కంపెనీలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. వారం రోజులుగా ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించగా... తమ పై అధికారుల ఆదేశాల మేరకు తాము పని చేస్తున్నామని పోలీసులు దాటేసే సమాధానాలు ఇస్తున్నారు.