Bandi Sanjay House Arrest : ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. 60 శాతం ఆర్టీసీ ఛార్జీలు పెంచటం ఇందుకు నిదర్శనమన్నారు. ఛార్జీల పెంపును భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న సంజయ్....ఆందోళనలు చేస్తామని వెల్లడించారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్‌లో ప్రయాణికులు, సిబ్బందితో సంజయ్ ముఖాముఖి నిర్వహించారు. జగిత్యాల వెళ్లే బస్సులో ప్రయాణికులతో మాట్లాడి ఛార్జీల పెంపుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలనే కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
2018 తర్వాత దాదాపు ఐదుసార్లు 60 శాతం మేర ఛార్జీలు పెంచారని విమర్శించారు. పేదలపై భారం పడుతోందన్న కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుందని ప్రశ్నించారు. తక్షణమే ఛార్జీలు తగ్గించాలని లేదంటే ఆందోళన చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు..
అంతకుముందు జేబీఎస్ వెళ్తానన్న సంజయ్ ప్రకటనతో.... ఆయనను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇంటివద్ద భారీగా మెహరించిన పోలీసులు...చుట్టూ భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు లేకుండా చేస్తున్నారని బండి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని.....ప్రశ్నించే గొంతులను, నిరసన గళాలను అణిచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అరెస్టులు, అణిచివేతలతో భాజపా ఉద్యమాలను ఆపలేరని బండి సంజయ్ స్పష్టం చేశారు. పోలీసు ఎస్కార్ట్‌తో బండి సంజయ్ జూబ్లీ బస్ స్టేషన్‌కు వెళ్లారు. ప్రయాణికులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ప్రజల తరఫున పోరాడే పార్టీ భాజపా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తమ పోరాటాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు. తమకు అరెస్టు, జైళ్లు కొత్త కావని.. ప్రభుత్వం ఎంత వరకు తెగించినా.. ప్రజల కోసం పోరాడటానికి తాము సిద్ధమని చెప్పారు. తమ ప్రయత్నాలకు ఎన్ని అడ్డంకులు వచ్చినా.. బస్సు ఛార్జీల పెంపుపై ఇవాళ ధర్నాలు చేసి తీరతామని భాజపా నేతలు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : TSRTC Charges: మరోసారి ఆర్టీసీ ఛార్జీల బాదుడు.. నేటి నుంచే అమలు