Secunderabad riots case : రాష్ట్రంలో మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా పోలీసుశాఖను తీర్చిదిద్దే ఉద్దేశంతో అధికారులు అనేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే ముందున్నారనడంలో సందేహం లేదు. అత్యధికంగా సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. దేశంలో మరెక్కడా లేనివిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది. సరికొత్త సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా పోలీసుశాఖను తీర్చిదిద్దుతున్నామని అధికారులు చెబుతున్నారు.
Secunderabad riots case updates : శాంతి భద్రతలకు ముప్పుకలిగించేలా అసాంఘిక శక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల ప్రచారాలను తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా మతాల మధ్య చిచ్చు రేకెత్తించేలా చేస్తున్న ప్రచారం ఒక్కోసారి మతఘర్షణలకు దారితీస్తోంది. ప్రభుత్వం తీసుకోని నిర్ణయాలను తీసుకున్నట్లు ప్రచారం చేయడమే కాదు వాటిని నమ్మేలా చేసేందుకు ఏకంగా నకిలీ ఉత్తర్వులనే సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో తీవ్ర గందరగోళం రేకెత్తుతోంది.
ఇటువంటివాటిని ముందుగానే పసిగట్టడం, వీటిని ఎవరు పోస్టు చేశారు? ఎందుకు పోస్టు చేశారు? వంటి వివరాలను అప్పటికప్పుడు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడంతోపాటు వాస్తవాలను ప్రజలకు చెప్పే ఉద్దేశంతోనే ఈ సామాజిక మాధ్యమాలను గమనించే ప్రత్యేక ల్యాబ్‌లను తెలంగాణ పోలీసుశాఖ జిల్లాల వారీగా ఏర్పాటు చేసింది. వీటి సాయంతో గత ఏడాది ఫేస్‌బుక్‌లో 64,296, ట్విటర్‌లో 42,979, వాట్సప్‌లో 29,127 పోస్టులను పరిశీలించి తగిన చర్యలు తీసుకున్నారు.
అయితే వాట్సాప్ గ్రూపుల ద్వారానే భారీ విధ్వంసానికి కుట్రపన్నిన సికింద్రాబాద్ ఘటనను పసిగట్టలేకపోవడం పెద్ద వైఫల్యంగానే భావిస్తున్నారు. వందల మంది మధ్య జరిగిన ఈ సంభాషణలను ఎందుకు గుర్తించలేకపోయారు? పైగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నప్పటికీ ఆ దిశగా సోషల్ మీడియాలపై ఎందుకు కన్నేయలేదు? వంటి అనేక ప్రశ్నలకు అధికారుల వద్ద సమాధానం లేదు. దాంతో ల్యాబ్‌ల వ్యవస్థ ప్రతిష్ఠ మసకబారింది.
సికింద్రాబాద్ వైఫల్యం నేపథ్యంలో ల్యాబ్‌లను చక్కదిద్దేందుకు అధికారులు నడుం బిగించారు. సాంకేతికంగా జరిగిన పొరపాట్లను అధ్యయనం చేయడంతోపాటు క్షేత్రస్థాయి సిబ్బంది, సాంకేతిక విభాగాల్లో పనిచేస్తున్న వారి మధ్య మెరుగైన సమన్వయం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు.