ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం ఘటనలో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతను పోలీసులు విచారిస్తున్నారు. గుంటూరులోని రమేష్ ఆసుపత్రికి సీవోవోగా వ్యవహరిస్తున్న ఆమెకు... విచారణకు హాజరుకావాలని పోలీసులు గతంలోనే నోటీసులు ఇచ్చారు. అయితే ఆమె ఇటీవలే కరోనా బారినపడి కోలుకుని హోం ఐసోలేషన్లో ఉన్నారు. తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు చెప్పటంతో ఆమె శుక్రవారం గుంటూరు నుంచి విజయవాడ వెళ్లారు. విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఆమెను పోలీసులు విచారిస్తున్నారు.
డాక్టర్ మమతను విచారణకు పిలవడంపై ఆమె భర్త, రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఘటన జరిగితే గుంటూరు రమేష్ ఆసుపత్రికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే వైకాపా పభుత్వం తమ కుటుంబాన్ని టార్గెట్ చేసిందని రాయపాటి రంగారావు ఆరోపించారు.
ఇదీ చదవండి : హెచ్ఎండీఏ మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించిన కేటీఆర్