Polavaram Project in AP : ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టు ఫలాలు ఇప్పట్లో అందే అవకాశం లేదా? జలాశయం నిర్మాణంతో ఏయే ప్రయోజనాలు సాధిస్తామని రాసుకున్నామో అవేమీ ఇప్పట్లో మన రాష్ట్రానికి దక్కబోవడం లేదా? కొన్నేళ్లపాటు ఈ ప్రాజెక్టు ఓ బ్యారేజి స్థాయి నిర్మాణంగానే మిగిలిపోనుందా? అనే ప్రశ్నలు రాష్ట్ర జలవనరుల నిపుణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పోలవరంలో 135 అడుగుల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా చేపట్టే పనులకు రూ.10,900 కోట్ల ఖర్చవుతుందని, 150 అడుగుల ఎత్తులో నీటి నిల్వ చేసేందుకు అయ్యే నిర్మాణానికి రూ.21,000 కోట్లు అవుతాయని మంగళవారం కేంద్ర జలసంఘం అధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తెలపడం చర్చనీయాంశమైంది.
పోలవరంలో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని 322 టీఎంసీలను వినియోగించుకోవాలనే లక్ష్యం సాకారం కావడం కష్టమేనా? పోలవరం ఆధారంగానే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించడమూ గగనమేనా? గోదావరి వరద కాలంలో పెన్నాతో అనుసంధానించే ప్రాజెక్టు దిశగా అడుగులు వేయడమూ సాధ్యం కాదా? ఇలా ఎన్నో అనుమానాలు ముసురుకుంటున్నాయి.
Polavaram Project News : ఏపీ ప్రభుత్వం 2023 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతోంది. మరోవైపు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు అవసరమైన రూ.47,725 కోట్ల మేర రివైజ్డు కాస్ట్ కమిటీ ఆమోదించిన మొత్తానికి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు రెండున్నరేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. దీనిపై స్పష్టత రాకుండానే కొత్తగా తొలిదశలో రూ.10,900 కోట్లకు అనుమతులనే చర్చ జరగడం జలవనరుల నిపుణుల్లో ఆందోళనకు తెరతీస్తున్నాయి. ప్రాజెక్టును +45.72 మీటర్ల స్థాయి (150 అడుగుల స్థాయికి)లో నిర్మించడానికి అవసరమైన మొత్తాలకుఆమోదం లభిస్తే అందులో తొలిదశ నిధులను ముందు ఇవ్వడానికి ఇబ్బందేమీ ఉండదు కదా.. మరి ఈ తాజా చర్చలు ఎందుకన్న ప్రశ్న నిపుణుల నుంచి వినిపిస్తోంది.
ఈ అంశాలపై తీవ్ర ఆందోళన
- పోలవరాన్ని రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. నిర్మాణానికి అవసరమయ్యే నిధులన్నీ మేమే ఇస్తామని కేంద్రమే చెప్పింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నా కేంద్రం నుంచి పూర్తిస్థాయి నిధులపై స్పష్టతే లేదు.
- పోలవరం నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందో తాజా ధరల్లో లెక్కలు కట్టాలని పోలవరం అథారిటీ ఎప్పుడో సూచించింది. అనేక ఏళ్ల కసరత్తు-ప్రశ్నలు-సమాధానాల అనంతరం కేంద్ర జలసంఘం రూ.55,656.87 కోట్లకు సాంకేతిక సలహా కమిటీ నుంచి 2019 ఫిబ్రవరి 18న ఆమోదం తీసుకుంది.
- ఆ తర్వాత రివైజ్డు కాస్ట్ కమిటీ ఈ మొత్తాన్ని రూ.47,725.74 కోట్లకు సవరించి 2020 మార్చి 6న ఆమోదించింది. తర్వాత కేంద్ర జలశక్తి శాఖ ఆమోదించి ఆర్థికశాఖకు పంపితే అక్కడ అనుమతి లభిస్తే నిధులు విడుదలవుతాయి.
- దాదాపు రెండేళ్ల నుంచి సంబంధిత పెట్టుబడి అనుమతి సాధించుకోలేకపోయామన్న విమర్శలు వస్తున్నాయి. భారీ కసరత్తు పూర్తయిన తర్వాత బంతి మళ్లీ పోలవరం అథారిటీ కోర్టులోకే వచ్చింది. అక్కడి నుంచి ముందుకే కదలడం లేదు. జలవనరులశాఖ అధికారులు మాత్రం ఇది రాజకీయ నిర్ణయమే తప్ప తామేమీ చేయలేమని అనధికారికంగా చెబుతూ వస్తున్నారు.
- పోలవరంలో 135 అడుగులకు పైన 150 అడుగుల మధ్యన 75 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసుకోవచ్చు. 135 అడుగులకే తొలిదశ నీటి నిల్వతో లైవ్ స్టోరేజి ఉండదు.
- పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా పూర్తి స్థాయి సామర్థ్యంతో నీటిని ఇవ్వాలంటే 133 అడుగుల వరకు నీటి నిల్వ ఉండాల్సిందే. అంతకన్నా తగ్గితే ఆ మేరకు కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీళ్లు ఇవ్వలేం. అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి ప్రయోజనాలు దక్కనట్లే.
ఇవన్నీ ఇప్పట్లో సాధ్యం కావు!
- ఎడమ కాలువ: దీని నుంచి 84.808 టీఎంసీలను మొత్తం 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వడం. విశాఖ పారిశ్రామిక అవసరాలకు, తాగునీటికి ఇదే కాలువ నుంచి మరో 23.44 టీఎంసీలు ఇవ్వడం.
- కుడి కాలువ: దీని ద్వారా 80.09 టీఎంసీలను 3.20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం. దీని నుంచే నష్టాలతో కలిపి కృష్ణా డెల్టాకు 84.70 టీఎంసీల వరకు మళ్లించడం.
- కొత్తగా 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడం.. 28.5 లక్షల మంది ప్రజలకు తాగునీటి వసతి కల్పించడం.. కాలువల నుంచి పూర్తి సామర్థ్యం మేరకు నీటిని మళ్లిస్తేనే ఈ ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి. జలాశయంలో +40.54 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ ఉంటేనే ఎడమ కాలువ నుంచి 226 క్యూమెక్కుల పూర్తి సామర్థ్యంతో నీటిని మళ్లించడం సాధ్యమవుతుంది. అలాగే +40.232 మీటర్ల ఎత్తులో నిటిమట్టం ఉంటేనే కుడి కాలువ నుంచి 342 క్యూమెక్కుల పూర్తి సామర్థ్యంతో నీటిని మళ్లించగలరు. అంటే 135 అడుగుల స్థాయికి మాత్రమే ఎత్తును పరిమితం చేసినంతకాలం ప్రాజెక్టు నుంచి పూర్తి స్థాయి అవసరాలు తీర్చడం సాధ్యం కాదు. వరద వచ్చినప్పుడు మాత్రమే నీరు ఇవ్వగలరు. వరద రోజులు కూడా వ్యాప్కోస్ నివేదిక ప్రకారమూ, ఎగువన కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో తగ్గిపోతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 135 అడుగుల నీటి నిల్వతో కొత్తగా పోలవరంతో సాధించేది ఏముంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, గోదావరి వరద జలాలను పెన్నాకు మళ్లించడం, సాగర్ ఆయకట్టు స్థిరీకరణ తదితర అనుసంధాన ప్రాజెక్టులు కష్టమే అని విశ్రాంత ఇంజినీరింగు అధికారులు అంటున్నారు.
135 అడుగులకే నీటి నిల్వ చేస్తే ఎంతో నష్టం
తొలిదశలో 135 అడుగులకే నీటి నిల్వ అనే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే కొత్త ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఇప్పటికే తాడిపూడి, పుష్కర ఎత్తిపోతల కింద నీళ్లు అందిస్తున్న 2.98 లక్షల ఎకరాలకే స్థిరీకరణ అభయం దక్కుతుంది. కృష్ణా డెల్టా కింద ఇప్పటికే సాగవుతున్న 13 లక్షల ఎకరాలకు, గోదావరి డెల్టా కింద ఇప్పటికే సాగవుతున్న 10 లక్షల ఎకరాలకు పైగా భూములకు నీటి భరోసా లభిస్తుంది. ఎత్తిపోతల పథకాల విద్యుత్తు ఖర్చులు తగ్గడం తప్ప కొత్తగా ఒనగూరే ప్రయోజనాలు అంతంతమాత్రమే.
ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా రూ.30 వేల కోట్లపైనే అవసరం. గత ఎనిమిదేళ్లలో కేంద్రం ఇచ్చింది రూ.11,920 కోట్లు మాత్రమే. అంటే ఏడాదికి సగటున రూ1,500 కోట్లు ఇచ్చింది. కనీసం కొత్త డీపీఆర్‌కు పెట్టుబడి అనుమతులను ఇవ్వడం లేదు. ఇలాంటి పరిణామాలు గమనిస్తుంటే.. నిధులు ఇచ్చే ప్రక్రియను తొలి, రెండోదశలుగా విడగొడితే 150 అడుగుల పూర్తి స్థాయిలో నీటిని నిలబెట్టేందుకు ఎప్పటికి వీలవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలవరం ఎంత సుదూరమో ఈ పరిణామాలను గమనిస్తే స్పష్టంగా అర్థం కావడం లేదా అని విశ్రాంత ఇంజినీర్లు పేర్కొంటున్నారు.