దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఆ ప్రభావం వ్యక్తిగత రవాణాతోపాటు ప్రజారవాణాపై కూడా తీవ్రంగా పడింది. వాహనాలను బయటకు తీసేందుకే భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడుతున్నవాహనదారులకు కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో కొంత ఊరటనిచ్చింది.
ఫలితంగా హైదరాబాద్‌లో పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం, వ్యాట్‌లతో కలిపి రూ.9.83, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం, వ్యాట్‌లతొ కలిపి రూ.7.67 లెక్కన ధరలు తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.97.82గా ఉన్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి.
పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90లుగా ఉంది. కొవిడ్‌తో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో గత ఏడాది నవంబరు 4వ తేదీన కేంద్రం ఎక్సైజ్ సుంకం రూ.5 తగ్గించడంతో ..రూ.27.90లకు దిగి వచ్చింది. ఈ ఏడాది మే 21వ తేదీన మరో రూ.8 కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
దీంతో ప్రస్తుతం పెట్రోల్‌పై కేంద్రం విధిస్తున్నఎక్సైజ్ సుంకం రూ.19.90లుగా ఉంది. అదే విధంగా డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ రూ.31.80...ఉండగా గత ఏడాది నవంబరు 4వ తేదీన కొవిడ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులకు ఊరటినిచ్చేందుకు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో రూ.21.80లకు దిగి వచ్చింది. ఈ ఏడాది మే 21వ తేదీన రెండో రోజుల కిందట మరో రూ.6లు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో ప్రస్తుతం డీజిల్‌పై కేంద్రం విధిస్తున్నఎక్సైజ్ సుంకం రూ.15.80లుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచడం, తగ్గించడం చేస్తుంటాయి. రోజువారీ ధరలను చమురు సంస్థలు నిర్ణయించి అమలు జరిగేలా చూస్తున్నాయి. కేంద్రం లీటర్ పెట్రోల్ పై రూ.8, లీటర్ డీజిల్‌పై రూ.6 లెక్కన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
తద్వారా....ఏయే పన్నులు ఎంతెంత పడతాయో...ఉజ్జాయింపుగా లెక్కగడితే....లీటరు ముడిచమురు సుమారుగా రూ.50 అనుకుంటే.. దాని ప్రాసెసింగ్, రీసైక్లింగ్, ఫ్రైట్ ఛార్జీలు, రవాణా ఖర్చులు తదితరవి కలుపుకొని రూ.7.43, రెండు దఫాలు కేంద్రం తగ్గించిన తరువాత కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.19.90, డీలర్ కమిషన్ రూ.3.80 ఇవన్నీ కలిపితే వ్యాట్‌తో సంబంధం లేకుండా లీటరు ధర రూ.81.13లుగా ఉంది. ఈ మొత్తంపై రాష్ట్ర ప్రభుత్వం 35.20 శాతం వ్యాట్ విధిస్తుంది. అంటే వ్యాట్ రూపేన మరో రూ. 28.55లు ఆ మొత్తానికి కలుస్తుంది. అంటే మొత్తం 109.68గా ఉంది.
ఇక డీజిల్ విషయానికి వస్తే....లీటరు ముడిచమురు సుమారుగా రూ.50.00 ఉంటుందనుకుంటే..., దాని ప్రాసెసింగ్, రీసైక్లింగ్, ఫ్రైట్ ఛార్జీలు, రవాణా ఖర్చులు తదితరవి రూ.8.60, రెండు దఫాలుగా తగ్గించిన తరువాత కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ.15.80, డీలరు కమిషన్ రూ.2.60 ఈ మొత్తం కలిపితే రూ.77.00లుగా ఉంది. ఈ మొత్తంపై 27శాతం రాష్ట్రం వ్యాట్ విధిస్తే....అంటే వ్యాట్ రూపేన మరో రూ. 20.78 ఆ మొత్తానికి కలుస్తుంది. ఈ రెండింటిని కలిపితే డీజిల్ ధర రూ.97.79లుగా ఉంది.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై 8 రూపాయిలు, డీజిల్‌పై 6 రూపాయిలు లెక్కన ఎక్సైజ్ సుంకం తగ్గించింది. పెట్రోల్‌పై తగ్గిన రూ.8ల సుంకంపై 35.20శాతం రూ.2.81లు వ్యాట్ తగ్గాల్సింది. అంటే పెట్రోల్ లీటరుపై రూ.10.81లు తగ్గాల్సి ఉంది. కాని చమురు సంస్థలు రూ.9.83లు మాత్రమే తగ్గించాయి. చమురు సంస్థలు తమ మాయాజాలతో దాదాపు రూపాయి మేర వాహనదారులు నష్టపోతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరో వైపు శనివారం కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పెట్రోల్ , డీజిల్ పంపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే నిల్వలు తెచ్చి పెట్టుకున్నాం. కేంద్రం సుంకాన్ని తగ్గించడంతో ప్రతి లీటరుపై ఆ మేరకు తాము నష్టపోతున్నామని తెలంగాణ రాష్ట్ర పెట్రోల్ బంక్‌ల యూనియన్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి డీలరు రూ.5లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు నష్టపోతున్నామని పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని చమురు సంస్థల నుంచి రీఎంబర్స్‌మెంట్ ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకాన్నికానీ, వ్యాట్‌లనుకాని తగ్గించడం వారం మొదట్లో చెయ్యాలని సూచించారు. ఆలా చేయడం ద్వారా తాము నష్టపోకుండే ఉండేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"కేంద్ర ప్రభుత్వం 8 రూపాయల బేస్ రేటు తగ్గించింది. దాంట్లో భాగమైన ఎక్సైజ్ డ్యూటీ తగ్గింది. తదనుకుగుణంగా బేస్ తగ్గినప్పుడు వ్యాట్ తగ్గించాలి. ఆయిల్ కంపెనీలు వ్యాట్ తగ్గించాలి. ఫలితంగా రూపాయి వరకు తగ్గే అవకాశం ఉంది."- కృష్ణారెడ్డి ఆర్థిక నిపుణులు
"కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాం. ఆదివారాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే నిల్వలు తెచ్చిపెట్టుకున్నాం. కేంద్రం సుంకాన్ని తగ్గించడంతో ప్రతి లీటరుపై నష్టపోతున్నాం. ఈ మొత్తాన్ని చమురు సంస్థల నుంచి రీఎంబర్స్‌మెంట్ ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం."-అమరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పెట్రోల్ బంక్‌ల యూనియన్ అధ్యక్షుడు
ఇదీ చదవండి: నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. 5నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతి..