రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని పిటిషన్లో ఆయన ఆరోపించారు. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అక్రమాలను ప్రశ్నించినందుకే వామన్‌రావు, నాగమణి దంపతులను హత్య చేయించారని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసుల ప్రమేయం కూడా ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారన్న నమ్మకం తమకు లేదని.. సీబీఐకి అప్పగించాలని కిషన్ రావు కోరారు.
హత్యకేసు నిందితులను వారం రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ ఇటీవలే మంథని కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటూ డీసీపీ రవీందర్ మంథని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనుమతించిన కోర్టు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ను వారంపాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది.