ఒకప్పుడు ఇంటి పెరట్లో మనకు కావాల్సిన మొక్కలు పెట్టుకునే వాళ్లం. కూరగాయల నుంచి జామ, మామిడి, దానిమ్మ, సపోటా లాంటి చెట్లు పెంచేవాళ్లు. కానీ ఇప్పుడు నగరాల్లో కొద్దిపాటి స్థలంలో చెట్లు నాటడం అనేది కుదరట్లేదు. అందుకే టెర్రస్ గార్డెన్ అనే పద్ధతిని చాలా మంది అవలంబిస్తున్నారు. బంగ్లా పైన చిన్నపాటి పెరటిని తలపించేలా కుండీలు ఏర్పాటు చేసుకుని చెట్లు పెంచుతున్నారు. పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో వాటిని సాగు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని బోడుప్పల్ ఆంజనేయనగర్ కాలనీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాదె రమణారెడ్డి తన డాబాపైన మొక్కలు పెంచుతున్నారు. ఇళ్లలో సాగు చేసే వారికి మొక్కలు, సేంద్రీయ ఎరువులు, స్టాండ్లు, కుండీలు ఇతర అంశాల్లో సహకారం అందిస్తున్న మై డ్రీమ్ గ్రీన్ హోం అనే అంకుర సంస్థ సహకారంతో.... చుట్టూ ఉన్న డాబాలు, బాల్కనీలు, ఇంటి ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచేలా వారిని ప్రోత్సహిస్తున్నారు.
మిద్దెతోటలతో అటు ఆరోగ్యం, ఇటు రుచి రెండూ పొందుతున్నట్లు రమణారెడ్డి చెబుతున్నారు. ఉరుకుల పరుగుల జీవనశైలి నుంచి మొక్కల మధ్య కాసేపు సేదతీరితే ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. వ్యాపకంగా మొదలైన మొక్కల సాగు... క్రమేణా అలవాటుగా, ఇతరులకు స్ఫూర్తిగా మారిందని చెబుతున్నారు.
రమణారెడ్డి తరహాలోనే ప్రతి ఇంట్లో మొక్కలు సాగు చేస్తే కల్తీలేని, ఆరోగ్యకరమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పొందవచ్చని స్థానికులు అంటున్నారు.