కరోనా ప్రభావంతో మద్యం, కల్లు దుకాణాలు మూత పడ్డాయి. ఈ ప్రభావంతో మద్యం ప్రియులు గతవారం రోజులుగా వింతగా ప్రవర్తిస్తున్నారు. మందు కల్లుకు అలవాటు పడ్డవారి పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. రెండు రోజులు క్రితం సినిమా పనిశ్రమలో పనిచేసే కార్మికుడు మద్యం దొరకొక పంజాగుట్ట ఫ్లై ఓవర్ మీద నుంచి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. జీడిమెట్ల పోలీస్టేషన్ పరిధిలోని దేవమ్మ బస్తీకి చెందిన ఓ వ్యక్తి గత ఐదు రోజులుగా కల్లు దొరకక పిచ్చి వాడిగామారి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో పోలీసులు అతని మృతదేహాన్ని గుర్తించారు.
మద్యం దొరకొక పోవటంతో సైఫాబాద్ పోలీస్టేషన్ పరిధిలోని చింతల్ బస్తీ లో ఓ యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మద్యం కోసం కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేట్లోని వాటర్ ట్యాంకర్ పైనుంచి కిందకు దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాలానగర్ ఐడీపీఎల్ కి చెందిన శ్రీను అనే వ్యక్తి మద్యం దొరకక ఐడీపీఎల్ అటవీ ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఎర్రగడ్డకు బారులు కట్టారు..
సోమవారం ఒక్కరోజే 94 మంది చికిత్స కోసం ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు వచ్చారు. మద్యం, కల్లు లాంటివి ఒక్క సారిగా ఆపడంతో మనిషి శరీరంలో పలు సమస్యలు తలెత్తుతాయని, సరైన సమయంలో చికిత్స అందిస్తే ప్రమాదం ఉండదని వైద్యులు చెబుతున్నారు.
మంత్రి సమీక్ష
ఈ పరిస్థతిపై అబ్కారీశాఖ అధికారులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. మద్యం దుకాణాల మూసివేతను కొనసాగిస్తూ వ్యసనపరులపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా అధికారులతో సమీక్షలు జరిపారు. అబ్కారీ శాఖ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అవసరమైతే.. దగ్గర్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందించే ఏర్పాట్ల గురించి పరిశీలించాలని అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి : తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య