కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవగా.. సీఎం పాల్గొన్నారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సిన్ పంపిణీ వ్యూహంపై చర్చించారు. వ్యాక్సిన్ కోసం ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారన్న సీఎం.. సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయా అనే విషయాన్ని నిర్ధరించుకోవాల్సి ఉందన్నారు. శాస్త్రీయంగా ఆమోదం పొందిన వ్యాక్సిన్ రావాల్సిన అవసరం ఉందని ప్రాధాన్యతాక్రమంలో అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణను రూపొందించామని.. మొదట రాష్ట్రానికి కొన్ని చొప్పున వ్యాక్సిన్ డోసులు పంపి కొంతమందికి ఇవ్వాలని సూచించారు. పది పదిహేను రోజులు పరిస్థితిని పరిశీలించి తర్వాత మిగతా వారికి ఇవ్వాలన్నారు. ప్రధాని సమీక్ష తర్వాత వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని దిశానిర్దేశం చేశారు. వ్యాక్సిన్ పంపిణీకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని.. రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు కోల్డ్‌చైన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో కమిటీలుగా ఏర్పడి వ్యాక్సిన్ పంపిణీ చేయాలన్న సీఎం.. కొవిడ్‌పై పోరాడుతున్న యోధులకు మొదట వ్యాక్సిన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, ఇతర శాఖల సిబ్బందికి మొదట వ్యాక్సిన్ ఇవ్వాలని.. 60 ఏళ్లు దాటిన, తీవ్రమైన జబ్బులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి: తొలిదశలో కోటి మంది ఆరోగ్య సిబ్బందికి టీకా!