pelican signals : పాదచారులను భద్రంగా రోడ్డు దాటించేందుకు జీహెచ్‌ఎంసీ 68 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నళ్లు ఏర్పాటు చేసింది. పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, రద్దీ కూడళ్లు, ప్రధాన రహదారులను సురక్షితంగా తీర్చిదిద్దడంలో భాగంగా చర్యలు తీసుకుంది. భాగ్యనగరంలో వాహనరద్దీ విపరీతమైంది. రోడ్డు దాటాలంటే సాహసం చేసినంత పనవుతోంది. వృద్ధులు, దివ్యాంగులేగాక యువత సైతం రహదారిని అవతలికి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
పాదచారులు క్షేమంగా రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నళ్లు ఉపయోగపడతాయి. రోడ్డుకు ఇరువైపులా స్విచ్ బోర్డులుంటాయి. వాటిపై ఉండే మీట నొక్కితే రెడ్ సిగ్నల్ పడుతుంది. స్థానిక అధికారులు నిర్దేశించిన సమయం పూర్తయ్యే వరకు ఎర్రలైటు వెలుగుతుంది. ఆ సమయంలో పాదచారులు సాఫీగా రోడ్డు అవతలికి చేరుకోవచ్చు. అనంతరం కొద్ది సమయంపాటు మీట నొక్కినా లైటు వెలగదు. పాదచారులు, వాహనదారులకూ ఉపయోగకరంగా ఉండే సాంకేతికతతో ఇవి పని చేస్తాయని జీహెచ్‌ఎంసీ తెలిపింది. మొత్తం 94 సిగ్నళ్లను ఏర్పాటు చేయాలనేది తమ లక్ష్యమని, పనులు పురోగతిలో ఉన్నాయని ఇంజినీర్లు తెలిపారు.