కరోనా వల్ల ఆలస్యమైన అటవీ సంరక్షణ, పునరుద్దరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను అటవీ సంరక్షణ ప్రధానాధికారి శోభ ఆదేశించారు. వచ్చే సీజన్‌కు సంబంధించిన హరితహారం కోసం నర్సరీ పనులను వేగవంతం చేయాలని... అటవీ పునరుద్ధరణ, కంపా, అర్బన్ పార్కుల పనులను లక్ష్యానికి అనుగుణంగా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. అధికారులందరూ క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్రాధాన్యత ఇస్తూ... పనులను పర్యవేక్షించాలని శోభ అదేశించారు. అన్ని సర్కిళ్ల చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులతో ఆరునెలల సమీక్ష నిర్వహించిన పీసీసీఎఫ్... పనుల్లో నాణ్యత, కచ్చితత్వం ఉండాలని స్పష్టం చేశారు. నాణ్యతతో పనులు జరగని చోట్ల సంబంధిత అధికారులను బాధ్యుల్ని చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అగ్ని ప్రమాదాల నివారణకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ముందస్తు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలను స్థానిక అటవీ అధికారులు సందర్శించి ఎప్పటికప్పుడు సాంకేతిక సహకారం అందించాలని శోభ సూచించారు. వన్యప్రాణుల సంచారం విషయంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని... జంతువులను రక్షించటంతో పాటు, అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు తగిన సూచనలు ఇవ్వాలని తెలిపారు. మనుషులు, జంతువుల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నివారించేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్న పీసీసీఎఫ్... వన్యప్రాణుల రక్షణ, ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలన్నారు. కంపా నిధుల ఖర్చు, పనుల పురోగతి, హరితహారం, అర్బన్ పార్కులు, రహదారి వనాల ఏర్పాటుపై సమీక్షించిన అటవీశాఖ ఉన్నతాధికారులు... అవసరమైన సూచనలు చేశారు.