లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు ప్రజలు మోయలేని భారంగా మారాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. మూడు నెలలకు ఒకేసారి విద్యుత్తు బిలులు తీసి... సగటున నాన్ టెలిస్కోపిక్ విధానంలో బిల్లులు వేయడం వల్ల ఎక్కువ వచ్చిందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు భరించలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అధిక విద్యుత్తు బిల్లులకు నిరసనగా ఈ నెల 6న రాష్ట్ర వ్యాప్తంగా... నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 12గంటలకు అన్ని పట్టణ, మండల విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందన్నారు. పేద కుటుంబాలకు విద్యుత్ బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని, బిల్లింగ్ విధానాన్ని టెలిస్కోపిక్‌లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన ఫేస్‌బుక్ లైవ్ ద్వారా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.