హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గాంధీ భవన్లో ఆ పార్టీ ముఖ్యనేతలపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర పడుతుండడంతోనే బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు.
గత ఐదేళ్లకాలం ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఎల్ అండ్ టీ మెట్రో జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తీసుకువచ్చినట్లు తెలిపారు. కరోనా ఉద్ధృతం చేయడం తప్ప హైదరాబాద్‌కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏం చేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు.
ఒక్కశాతం మంది అర్హులకు రెండు పడక గదుల ఇళ్లు వచ్చినా కార్పొరేషన్ల ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటామని ఉత్తమ్ ప్రకటించారు. ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి, పాత బస్తీ అభివృద్ధిపై ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకుపోతామని స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్రి అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.200 కోట్లు అందుబాటులో ఉండేవన్నారు. ఆరేళ్లలో ఉస్మానియా ఆస్పత్రి కోసం ఒక్క రూపాయ అయినా ఖర్చుచేశారా అని ఉత్తమ్ ప్రశ్నించారు.
సచివాలయంలోని మందిరం, మసీద్ కూల్చివేతపై ఉత్తమ్ మండిపడ్డారు. మసీద్ కూల్చివేత అనంతరం.. కేసీఆర్ వ్యాఖ్యలను ఎంపీ అసదుద్దీన్ ఎలా సమర్థిస్తారని నిలదీశారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తామని ప్రకటించారు.
కరోనా కట్టడిపై ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్తామని ఉత్తమ్ పేర్కొన్నారు. మృతులకు రూ.10 లక్షల పరిహారం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు.
హైదరాబాద్, వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల పరిధిలో ఈనెల 24లోగా పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలో పార్టీ విజయానికి కృషిచేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు.
కరోనా కట్టడిపై ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీఎల్పీ నేత భట్టి విమర్శించారు. సచివాలయం కూల్చివేతను ఓ కుట్రగా అభివర్ణించారు. మందిరం, మసీద్ కూల్చివేతపై అందిరినీ కలుపుకొని పోరాటం చేస్తామన్నారు. కార్పొరేషన్ ఎన్నికలపై పటిష్ఠ కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇవీచూడండి: వర్షాలు, వరదలతో మరింత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుతం