రెడ్లకు పగ్గాలు ఇస్తేనే పార్టీలకు మనుగడ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్ స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించేట్లు ఉన్నాయని మధుయాస్కీ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పీసీసీ అధ్యక్షుని వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్న మధుయాస్కీ.. అన్ని కులాల కలయికే కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ వ్యక్తి కంటే వ్యవస్థ, పార్టీ ముఖ్యమని స్పష్టం చేశారు.
కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా, తనకు ప్రచార కమిటీ ఛైర్మన్‌గా పదవులు వచ్చాయంటే.. రాహుల్, సోనియా గాంధీల చొరవేనని మధుయాస్కీ పేర్కొన్నారు. సీఎల్పీ నేతగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్, పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత డి.శ్రీనివాస్.. నాయకత్వంలో రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన జలగం వెంగళ్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 42 లోక్‌సభ స్థానాలకు గాను 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో అగ్రవర్ణాల చేతిలో బలహీన వర్గాలు బలవుతున్న విషయాన్ని గ్రహించిన సోనియాగాంధీ... ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆయా వర్గాలను మోసం చేశారని ఆరోపించారు.
"వరంగల్ డిక్లరేషన్‌తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ వైపు వస్తున్న సమయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్.. రెడ్ల కిందనే పని చేయాలని వ్యాఖ్యానించటం ఆక్షేపనీయం. ఉదయపూర్‌లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు సైతం వ్యతిరేకిస్తున్నట్లు పీసీసీ వ్యాఖ్యలు చూస్తే అర్థం అవుతుంది. ఒక రెడ్డి సామాజిక వర్గంతోనే ప్రభుత్వం ఏర్పడిందంటే పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు పార్టీ ఓటమి పాలైంది. 2004-09లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం రెడ్డి, బీసీల కలయికనే అన్న విషయాన్ని గుర్తించిన అధిష్ఠానం 2023 ఎన్నికలే లక్ష్యంగా పీసీసి, సీఎల్పీ ప్రచార కమిటీలకు రెడ్డి, దళిత, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర మైనార్టీ వర్గాలు అన్ని కాంగ్రెస్ పార్టే దిక్కు అని భావిస్తున్న తరుణంలో అన్ని పార్టీలకు రెడ్లే నాయకత్వం వహిస్తే బాగుంటుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం. తక్షణమే రేవంత్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలి." - మధుయాస్కీ గౌడ్, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్
ఇవీ చూడండి: