రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 శాతం వేతనం పెంచాలని వేతన సవరణ సంఘం ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. కమిటీ ఛైర్మన్ సీఆర్ బిశ్వాల్, సభ్యుడు మహ్మద్ రపత్ ఆలీలు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు బీఆర్‌కే భవన్‌లో నివేదిక అందజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు 15 శాతం ఫిట్‌మెంట్‌కు కమిషన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం ఉద్యోగుల వేతన సవరణపై కమిషన్ నివేదిక ఇచ్చింది. వేతన సవరణ కోసం 2018 మే 18వ తేదీన తెలంగాణ తొలి కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని మొదట కమిషన్‌కు గడువు ఇచ్చిన ప్రభుత్వం... ఆ తర్వాత వివిధ కారణాల రీత్యా పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. వేతన సవరణతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా తగిన సిఫారసులు చేయాలని ప్రభుత్వం కమిషన్‌కు విధివిధానాలు ఇచ్చింది. వేతనాల పెంపు సహా అన్ని అంశాలపై ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నుంచి కమిషన్ వినతులు స్వీకరించింది. వారితో సమావేశమై వాదనలు కూడా వినింది.
వేతన సవరణపై కమిషన్ సిఫారసులు
డిసెంబర్ నెలాఖరులోపు వేతన సవరణ ఖరారు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా కమిషన్ నివేదిక సమర్పించింది. ఉద్యోగుల వినతులు, పెరిగిన ధరలు, ఆర్థిక స్థితిగతులు, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలు తదితర అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని వేతన సవరణపై కమిషన్ సిఫారసులు చేసింది. సీల్డ్ కవర్‌లో కమిషన్ సీఎస్‌కు నివేదిక సమర్పించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని అధికారుల కమిటీ వేతన సవరణ సంఘం ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి విశ్లేషించనుంది. ఆ తర్వాత రెండో వారంలో కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. 6, 7 తేదీల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. అనంతరం అన్నింటినీ క్రోడీకరించి వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపుపై ప్రభుత్వానికి కమిటీ సూచనలు చేయనుంది. వేతన సవరణ కసరత్తును వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారుల కమిటీ తెలిపింది.
కొనసాగనున్న పీఆర్సీ కమిషన్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది. అయితే కరోనా, తదనంతర పరిణామాల నేపథ్యంలో రాబడులు తగ్గిన పరిస్థితుల్లో ఈ మారు ఏ మేరకు ఉండవచ్చన్న విషయమై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కో శాతం ఫిట్ మెంట్ ఇస్తే ప్రభుత్వంపై ఏడాదికి 300 కోట్లకు పైగా అదనపు భారం పడుతుందని అంచనా. అయితే అన్ని రకాల ఉద్యోగులతో పాటు విద్యా వాలంటీర్లు, ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. దీంతో భారం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు మాత్రం వేతనసవరణ సంతృప్తికరంగానే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామన్న ఎన్నికల హామీపై కూడా ఉద్యోగ సంఘాలతో చర్చించి వేతన సవరణతో పాటే ప్రభుత్వం ప్రకటించనుంది. పీఆర్సీ కమిషన్ పొడిగించిన గడువు నిన్నటితో ముగియాల్సి ఉంది. అయితే బిజినెస్ రూల్స్, సర్వీసు నిబంధనలు తదితరాలపై ఇంకా కసరత్తు పూర్తి కానందున కమిషన్ గడువును మరికొన్నాళ్ల పాటు పొడిగించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి: జనవరిలోనే పదోన్నతులు, వేతన సవరణ: సీఎం కేసీఆర్