pawan kalyan: ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు తలపెట్టినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. 'ఒక్కసారి పవర్ ఇవ్వండి.. నా పవర్ ఏంటో చూపిస్తా' అంటూ ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ ఛార్జీలను పెంచి తన పవర్ చూపించారని దుయ్యబట్టారు. ఉగాది కానుకగా రూ.1,400 కోట్ల విద్యుత్ ఛార్జీల వడ్డింపుతో పాటు ట్రూ అప్ ఛార్జీల పేరిట మరో రూ.3 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఎద్దేవా చేశారు. ఆదాయం, రాబడి లేకపోగా.. చెత్త పన్ను, ఆస్తి పన్ను, ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్, లిక్కర్‌పై అధిక వ్యాట్ వేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు విద్యుత్తు ఛార్జీలు పెంచి సామాన్యుడి వెన్ను విరిచేస్తున్నారని ఆక్షేపించారు. సంక్షేమ పథకాల పేర్లతో ఓ చేత్తో రూ.10 ఇచ్చి.. మరో చేత్తో రూ.20 లాక్కుంటున్నారని విమర్శించారు.
పాదయాత్ర సమయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను మరిచిపోయారని పవన్ మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఏపీ.. ఇవాళ అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోతోందని ఆందోళన వెలిబుచ్చారు. గ్రామాల్లో 3 నుంచి 6 వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నీటి పన్ను, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై 'బాదుడే బాదుడు' అని మాట్లాడిన జగన్.. ఈ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచితే దీనిపై ఏం మాట్లాడాలని నిలదీశారు.
తెల్లవారితే చాలు.. జగన్ ప్రభుత్వం ఏ పన్నులు విధిస్తుందో, ఏ ఛార్జీలు పెంచుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోయే పరిస్థితి నెలకొందని పవన్ వ్యాఖ్యానించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నేడు కలెక్టరేట్ల వద్ద చేపట్టే నిరసన కార్యక్రమాల్లో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలంటూ వినతి పత్రాలు అందజేయటం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు ప్రజల తరఫున పోరాటం చేస్తామని పవన్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎన్టీఆర్ ఏమన్నారంటే?