భాగ్యనగరంలో 1872 నాటికే 16 ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. తొలుత 1854లో దారుల్ ఉలూం ఓరియంటల్ పాఠశాల, కళాశాలను అప్పటి పాలకులు ఏర్పాటు చేశారు. అప్పట్నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో విద్యాసంస్థలకు భాగ్యనగరం వేదికైంది. అంతర్జాతీయ సంస్థలకూ నగరం చిరునామాగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 9.88లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. 2050 నాటికి 23-25లక్షలకు చేరుతారని విద్యావేత్తల అంచనా. అందుకు తగ్గట్టుగా పాఠశాలల సంఖ్య, సౌకర్యాలు మెరుగుపర్చే విషయంపై పాలకులు దృష్టి పెట్టాలి.
ఫీ‘జులుం’ నియంత్రించాలి
నగరంలో ప్రభుత్వంతోపాటు ప్రైవేటు విద్యాసంస్థలు పెద్దఎత్తున వెలుస్తున్నాయి. ప్రస్తుతం మూడు జిల్లాల్లో 4,900 ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 5.65లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆయా విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ సవాలుగా మారింది. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో విద్య పూర్తిగా వ్యాపారంగా మారిపోయిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేకంగా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇలా చేస్తే...
* ఫీజుల నిర్ణయంలో తల్లిదండ్రుల కమిటీలకు పెద్దపీట వేయాలి.
* నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు అవసరం.
* ఫీజుకు తగినట్లు సౌకర్యాలు కల్పిస్తున్నాయో లేదో నిత్య పర్యవేక్షణ అవసరం.
* తల్లిదండ్రులు చెల్లించిన ప్రతి పైసాకు రసీదు ఇచ్చేలా చూడాలి.
అంగన్‌వాడీలను తీర్చిదిద్దాలి
ప్రాథమిక దశలో ఉండే అంగన్‌వాడీ కేంద్రాలను తీర్చిదిద్దాలి. అక్కడ పునాది పడితే పిల్లలు అన్ని విధాలా రాణిస్తారు. ఒత్తిడిలేని చదువులతో పిల్లల సృజన బయటికి తీసే యత్నం చేయాలి. ఇందుకు జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) దోహదపడుతుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 10+2 పద్ధతికి స్వస్తి పలికి 5+3+3+4 మోడల్ ఎన్‌ఈపీతో అమల్లోకి రానుంది. ప్రభుత్వ రంగంలోనే ప్రీ స్కూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఆన్‌లైన్‌లో దూసుకెళ్లాలి..
కరోనా వ్యాప్తి నివారణ ఉద్దేశంతో నగరం ఆన్‌లైన్ బోధన విధానం అందిపుచ్చుకుంది. మొదట్లో విద్యార్థుల తల్లిదండ్రులు కాస్త ఇబ్బందిపడ్ఢా. ఆపై వెంటనే తేరుకొని అందిపుచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వమే డిజిటల్ పాఠాలు సిద్ధం చేసి టీవీల్లోనూ అందిస్తోంది. 3-10 తరగతిలోని 3.63లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ పాఠాలు బోధిస్తోంది. రానున్న రోజుల్లో డిజిటల్ బోధనకు ప్రాధాన్యం పెరగనున్న దృష్ట్యా పాఠశాలల పరంగా మార్పులు తీసుకురావాల్సి ఉంది.
దూసుకెళ్లాలంటే..
* ప్రతి పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు నిర్మించాలి.
* పాఠాలు రికార్డు చేసి అందించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు శిక్షణ, వనరులు అవసరం.
* ప్రీ రికార్డెడ్ వీడియోలతో కలిగిన మొబైల్‌ఫోన్లు లేదా ట్యాబ్ విద్యార్థులకు ఇవ్వాలి.
* ఎక్కడున్నా తరగతి గది పాఠాలు వినేలా నెట్ సేవలు విస్తృతం చేయాలి.
ఇదిగో ఆదర్శం: కరోనా మహమ్మారి రాక మునుపు నుంచే అమెరికాలోని చాలావరకు విద్యా సంస్థలు ఆన్‌లైన్ బోధనకు మొగ్గు చూపాయి. రెండేళ్ల కింటే అమెరికాలోని చేపట్టిన సర్వే ప్రకారం 6.3 మిలియన్ విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా కోర్సులు చేస్తున్నట్లు తేలింది.
ఇవి మనకూ కావాలి!
దిల్లీ.. కేటాయింపుల్లో భేష్
విద్యావ్యవస్థలో దిల్లీ దేశానికి ఆదర్శం. అక్కడి ప్రభుత్వం కొత్తగా 8వేల అదనపు తరగతి గదులు నిర్మించింది. మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో 26శాతం విద్యా రంగానికి కేటాయిస్తుండటంతో బడుల్లో మౌలిక వసతుల సమస్య తీరింది.
కేరళ.. డ్రాపవుట్లపై దృష్టి
93.91శాతం అక్షరాస్యతతో కేరళ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అధ్యయన కేంద్రం నివేదిక ప్రకారం ప్రాథమిక స్థాయిలో డ్రాపవుట్లు చాలా వరకు తక్కువగా ఉంది.
ఫిన్లాండ్.. ఒత్తిడి లేని విద్య
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థకు ఫిన్లాండ్ చిరునామా. ఉదయం 9గంటల నుంచి 9.45 మధ్య బడులు ప్రారంభమై మధ్యాహ్నం 2 నుంచి 2.45 మధ్య ముగుస్తాయి. దీంతో విద్యార్థులు ఒత్తిడికి గురికావడం లేదు. మన వద్ద కూడా ఇలా సమయాలు పాటిస్తే మేలు!
జపాన్.. క్రీడల కోసం క్లబ్‌లు
జపాన్‌లో అన్ని పాఠశాలలో ఆటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పాఠశాలలకు సకల సదుపాయాలతో కూడిన క్రీడామైదానాలు ఉంటాయి. ప్రతి తరగతిలోని విద్యార్థులను క్లబ్‌లుగా విభజిస్తారు. ఈ క్లబ్‌లోని సభ్యులు క్రీడలు లేదా సంగీతం, ఆర్ట్స్ వంటి కార్యకలాపాల్లో పాల్గొనాలి.
ఊరట కలిగించాలి
* ‘ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక విధి విధానాలు తీసుకురావాలి. ఫీజుల నియంత్రణకు ఓ వ్యవస్థ తెస్తామన్న ఏ పాలకుడి హామీ నెరవేరలేదు. కనీసం ప్రభుత్వ విద్యనైనా బలోపేతం చేయాలి. పన్ను రాయితీ కాదు.. ఫీజుల నుంచి ఊరట కలిగించాలి.’
- సీమ అగర్వాల్, వర్కింగ్ ప్రెసిడెంట్, హైదరాబాద్ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం
డిజిటల్ లెర్నింగ్ కీలకం
* ‘భవిష్యత్తులో డిజిటల్ లెర్నింగ్ కీలకం కానుంది. 25శాతం సిలబస్ ఆన్‌లైన్ ద్వారా బోధించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ విద్యను అందిపుచ్చుకునేలా ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించాలి. విద్యార్థులకు ల్యాప్‌టాప్ లేదా ట్యాబులు వంటివి అందించే విషయాన్ని పరిశీలించాలి.’
-ప్రొ.రామచంద్రం, మాజీ ఉపకులపతి, ఉస్మానియా వర్సిటీ
వ్యవస్థలో మార్పు అవసరం
* ‘జాతీయ విద్యా విధానం అమల్లోకి రానుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగంలో కిండర్ గార్డెన్ స్కూళ్లు ఏర్పాటు చేయాలి. ఎన్‌ఈపీకి అనుగుణంగా పాఠశాల వ్యవస్థలో మార్పులు రావాలి. ఎప్పటికప్పుడు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాలి. అదే సమయంలో బడుల్లో మౌలిక వసతులూ కల్పించాలి.
- ఎం.రవీందర్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
సౌకర్యాలు కల్పించాలి
* ‘పాఠశాలల్లో డిజిటల్ సౌకర్యాలు మెరుగుపడాలి. ఇందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని అందిపుచ్చుకుని వసతులు మెరుగుపర్చుకోవాలి. విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరగాలి. విద్యార్థిలోని నైపుణ్యాలు మెరుగుపరిచేలా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి. ఈ విషయంలో దిల్లీని ఆదర్శంగా తీసుకోవాలి.’
-పద్మప్రియ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో..
* మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 2499
* చదువుతున్న విద్యార్థులు 4.23 లక్షలు
* ప్రైవేటు విద్యా సంస్థలు 4901
* చదువుతున్న విద్యార్థులు 6.25 లక్షలు
ఇప్పుడున్న సౌకర్యాలు ఇవీ..
* ఒకే మరుగుదొడ్డి ఉన్న బడులు 715
* మంచినీటి శుద్ధి కేంద్రాలు ఉన్నవి 563
* కుళాయిలు ఉన్న బడులు 1168
* ఆటస్థలం ఉన్నవి 1683
* గ్రంథాలయం ఉన్నవి 1234