Telangana MPs in Parliament : తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.1,61,455 కోట్ల రుణం తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. సోమవారం లోక్‌సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ తెలంగాణ తీసుకున్న రుణాలను కూడా వివరించారు. బహిరంగ మార్కెట్, నాబార్డు లాంటి ఆర్థిక సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి 2018-19, 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా రూ.29,136 కోట్లు, రూ.38,285 కోట్లు, రూ.44,834 కోట్ల రుణం తీసుకుందని, 2021-22 బడ్జెట్‌లో రూ.49,200 కోట్ల రుణాలను చూపినట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ నుంచి రూ.1,55,133 కోట్లు, నాబార్డు, ఎన్‌సీడీసీ, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, మరికొన్ని ఇతర సంస్థల నుంచి రూ.5,082 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,240 కోట్ల రుణం తీసుకున్నట్లు వివరించారు.
విభజన చట్టం కింద రూ.2,250 కోట్లు..
Parliament Sessions 2022 : ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం నిబంధనల ప్రకారం తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.2,250 కోట్లు విడుదల చేసిందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. సోమవారం లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2015-16 నుంచి అయిదేళ్లలో ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున మొత్తం రూ.2,250 కోట్లు అందించినట్లు వివరించారు. 2021, మార్చి 31న విడుదల చేసిన రూ.450 కోట్లకు తెలంగాణ ప్రభుత్వం 2022, మార్చి 3న వినియోగ ధ్రువీకరణ పత్రం సమర్పించినట్లు చెప్పారు.
ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని ప్రతిపాదనలు రాలేదు..
Telangana in Parliament 2022 : ఎస్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర గిరిజన శాఖకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆ శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తెలిపారు. లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన కింద తెలంగాణకు 2020-21లో రూ.41.91 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.
తెలంగాణకు రూ.7,541 కోట్ల జీఎస్‌టీ పరిహారం
Revanth Reddy in Parliament 2022 : జీఎస్‌టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పరిహారం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.8,868 కోట్లు, తెలంగాణకు రూ.7,541 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో తెలిపారు. 2018-19లో తప్ప మిగిలిన అన్ని సంవత్సరాల్లో పరిహారం చెల్లించినట్లు చెప్పారు.
సీడబ్ల్యూసీ పరిశీలనలో ఆరు తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణకు చెందిన ఆరు ప్రాజెక్టులు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిశీలనలో ఉన్నాయని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. ఇందులో నాలుగు భారీ, బహుళార్ధ సాధక ప్రాజెక్టులు, రెండు మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నట్లు సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. ‘‘దేశవ్యాప్తంగా 39 ప్రాజెక్టులు సీడబ్ల్యూసీ పరిశీలనలో ఉన్నాయి. ప్రి ఫీజిబిలిటీ రిపోర్టు, ప్రాజెక్టుల డీపీఆర్‌లు, వాటి ద్వారా తలెత్తే అంతర్రాష్ట్ర పరిణామాలు, వరద నియంత్రణ పథకాలను సీడబ్ల్యూసీ.. సంబంధిత కేంద్ర ప్రభుత్వ సంస్థలతో కలిసి పరిశీలిస్తుంది. పరిశీలన పూర్తయ్యాక వాటిని అడ్వయిజరీ కమిటీ ముందుంచుతుంది. ఆ తరవాత తుది నిర్ణయాన్ని వెల్లడిస్తుంది’’ అని పేర్కొన్నారు.