తిరుమల చరిత్ర ఏనాటిది... నాని చరిత్ర ఏపాటిదని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం చదువుకోకుండా కొడాలి నాని ఏపీలో మంత్రి అయ్యాడని హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ధ్వజమెత్తారు. దేవాలయాలపై నాని దిగజారుడు వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మౌనం వహిస్తే... ఈ మాటలు తానే మాట్లాడిస్తున్నారని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
హిందువులు అక్కరలేదని...మంత్రులు ఇలాగే మాట్లాడితే పునాదులు కదిలిపోతాయని హెచ్చరించారు. ఏ ప్రభుత్వం, అధికారులు.. దేవాలయాల జోలికి వెళ్లవద్దన్నారు. హిందువులు కానీ వారు దేవుడిపై నమ్మకంతో వీటిని అంగీకరిస్తూ డిక్లరేషన్ రాసివ్వాలని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయిన తర్వాత 16 నెలల్లో 16 దాడులు జరిగాయన్నారు. వీటిపై జగన్మోహన్ రెడ్డి స్పందించాలని... లేదంటే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పరిపూర్ణానంద డిమాండ్ చేశారు.