ఏపీ పంచాయతీ ఎన్నికల్లో హింసను అరికట్టాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని భాజపా, జనసేన స్పష్టం చేశాయి. నామినేషన్లు వేసే వారిని బెదిరించడం తగదని అన్నాయి. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... ఇరు పార్టీల ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించారు.
గతంలో జరిగిన హింసాత్మక ప్రక్రియను ఏపీ ప్రభుత్వం నిలుపుదల చేయాలి. హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా బెదిరించే ధోరణిని అరికట్టాలి
-సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
శాంతియుత వాతావరణంలో ఏపీ ఎన్నికలు జరగాలి. గతేడాది ఎన్నికల సమయంలో విధ్వంస ఘటనల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలి. కనీవినీ ఎరుగని రీతిలో ఏకగ్రీవాలపై ప్రకటనలు వేయడం ఆశ్చర్యంగా ఉంది. దీనిపై జనసేన, భాజపా నేతలు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలి. ఎవరెన్ని కుట్రలు పన్నినా తిప్పికొడతాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుంటే అందరికి మంచిది. గొప్ప అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి
-నాదెండ్ల మనోహర్, జనసేన పీఏసీ ఛైర్మన్
- ఇదీ చదవండి : 'ఒక్క ప్రాజెక్టులోనైనా అవినీతిని చూపించగలిగారా?'