ఏపీలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సర్పంచి స్థానాలకు 7,506 మంది పోటీ చేస్తున్నారు. 20,157 వార్డు సభ్యుల స్థానాలకు 43,601 మంది బరిలో ఉన్నారు. పోలింగ్‌కు 88,523 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. నోటిఫికేషన్ ఇచ్చిన 3,249 గ్రామ పంచాయతీల్లో 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో నిలిపివేసిన ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సోమవారం సాయంత్రం తిరిగి అనుమతించారు.
కరోనా సోకిన వారికి ప్రత్యేకంగా..
కరోనా సోకిన వారు మైదాన ప్రాంతాల్లో మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు, ఏజెన్సీ ప్రాంతాల్లో 12.30 నుంచి 1.30 గంటల వరకు ఓటు వేసేలా ఏర్పాట్లు చేశారు. సాధారణ ఓటర్లను థర్మల్ స్కానింగ్ చేసి సాధారణం కంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే వారిని వెనక్కి పంపి చివరి గంటలో అనుమతిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి మాస్క్‌లు, చేతి తొడుగులు, శానిటైజర్ సిద్ధం చేశారు. కరోనా సోకిన వారు ఓటింగ్‌కి ఎక్కువ మంది వస్తే ఆ కేంద్రాల్లో సిబ్బందికి పీపీఈ కిట్లు సమకూర్చుతారు. ఓట్ల లెక్కింపు కోసం 14,535 మంది పర్యవేక్షకులు, మరో 37,750 మంది సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు ప్రత్యక్ష పరిశీలనకు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్, పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను తెలుసుకోవడానికి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు.
- ఇదీ చూడండి : జలవిలయం: ఆ 197 మంది ఎక్కడ?