తెలంగాణ, హరియాణా రాష్ట్రాలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ సేవల విస్తరణపై భారతీయ రైల్వే దృష్టి సారించింది. భారతీయ రైల్వే ద్వారా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరా…. వచ్చే 24 గంటల్లో దాదాపు 640 మెట్రిక్ టన్నులకు చేరుకోబోతుందని రైల్వే శాఖ తెలిపింది. భారతీయ రైల్వే.. నిరంతర ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహణతో రాష్ట్రాలకు ఉపశమనం కలిగిస్తుందని రైల్వే శాఖ ఆభిప్రాయపడింది.
భారతీయ రైల్వే ద్వారా.. ఇప్పటికే మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, దిల్లీ రాష్ట్రాలకు సేవలను విస్తరించారు. తాజాగా హరియాణా, తెలంగాణ రాష్ట్రాలకు విస్తరించినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ కోసం దక్షిణ మధ్య రైల్వేని సంప్రదించగా.. బుధవారం నాడు 5 ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను ద.మ. రైల్వే సికింద్రాబాద్ నుంచి అంగూల్‌కు చేరవేసిందని తెలిపింది. ఇది ఆక్సిజన్‌తో అంగూల్ నుంచి సికింద్రాబాద్‌కు త్వరలోనే చేరుకుంటుందని తెలిపింది. నిరంతర ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహణలో భాగంగా మరో మూడు రైళ్లు నడుస్తున్నాయని రైల్వే వివరించింది. వీటితో కలిపి భారతీయ రైల్వే వచ్చే 24 గంటల్లో దాదాపు 640 మెట్రిక్ టన్ను లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎమ్‌ఓ)ను చేరవేసే అవకాశాలున్నాయని వెల్లడించింది.
ఉత్తర ప్రదేశ్‌కు 5 ట్యాంకర్లలో 76.29 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎమ్‌ఓ) గల 5 ఆక్సిజన్ ట్యాంకర్లు ఎక్స్‌ప్రెస్‌లో చేరుకున్నాయి. వీటిలో ఒక ట్యాంకర్ వారణాసిలో, మిగిలిన మరో 4 ట్యాంకర్లు లఖ్‌నవూ చేరుకున్నాయి. 4 ట్యాంకర్లలో 33.18 మెట్రిక్ టన్నులు లఖ్‌నవూ చేరువలో ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. ఇది అక్కడికి 30వ తేదీన చేరుకునే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అవసరమైన అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ రవాణా సేవలు అందించడానికి భారతీయ రైల్వే పూర్తి సన్నద్ధంగా ఉందని స్పష్టం చేసింది.