Oppositions Comments: దేశంలో మార్పు కోసం కొత్త రాజ్యాంగం తీసుకురావాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. రాజ్యంగబద్ధమైన పదవీలో ఉండి ఆ రాజ్యాంగాన్నే ముఖ్యమంత్రి అవమానపరిచారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా కేసీఆర్ ప్రవర్తించారని ఆరోపించారు. సీఎంలో అభద్రతా భావం స్పష్టంగా కనిపిస్తోందన్న కిషన్ రెడ్డి... తీరుమార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అర్ధరహితమని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఇందుకు నిరసనగా గురువారం అన్ని పార్టీ కార్యాలయాల్లో నిరసన చేపడతామని వెల్లడించారు. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతోనే... కేసీఆర్ మరోసారి సెంటిమెంట్ రగిలించి లబ్ది పొందాలని చూస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ల రద్దు కోసం భాజపా చేస్తున్న కుట్రలను కేసీఆర్ ప్రతిపాదిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలపై కేంద్రంతో పోరాడకుండా... అనవసరపు రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఏదో ఒక సమస్య సృష్టిస్తున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ను ముఖ్యమంత్రి అవమానించారని ఆక్షేపించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
కేసీఆర్‌కు రాజ్యాంగం ఏ విధంగా అడ్డువస్తోందో చెప్పాలని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ సాధించామంటే అందుకు కారణం రాజ్యాంగమేనన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ప్రాణత్యాగానికైనా సిద్ధమన్నారు. రాజ్యాంగం మారుస్తామనే చర్చ తెస్తే తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ హెచ్చరించారు. ఫ్యూడల్ ఆలోచనలున్న కేసీఆర్‌కు ప్రస్తుత రాజ్యాంగం ఏం అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా భాజపా, బహుజన సమాజ్ పార్టీ నేతలు...పలుచోట్ల నిరసన తెలిపారు.
ఇదీ చూడండి: