ఏకధాటిగా కురిసిన వర్షానికి పాతబస్తీలోని పలు ప్రాంతాలు భారీ నష్టాన్ని చవి చూశాయి. ముఖ్యంగా చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బాబానగర్, గాజీ మిల్లట్, శివాజీ నగర్, ఉప్పుగూడ లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇండ్లలోకి, విధుల్లోకి వచ్చి భారీ నష్టాన్ని మిగిల్చింది.
చెరువుకట్టల మరమ్మతులు:
చాంద్రాయణగుట్ట సమీపంలోని అల్జుబైల్ కాలనీ మొత్తం ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు అలాగే నిలిచిపోయింది. ఇండ్లలోకి భారీగా బురద నీరు చేరింది. ఇప్పటివరకు ఈ ప్రాంతానికి 3 మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇంటి సామగ్రి సైతం నీళ్లలో కొట్టుకెళ్లాయి. కాలనీ చుట్టూ భారీగా చెత్త, బురద పేరుకుపోయింది. ఫలక్నుమా ఓవర్ బ్రిడ్జ్కూ 6 అడుగుల భారీ గుంత పడడం వల్ల రాక పోకలు ఆగిపోయాయి. వందల సంఖ్యలో ప్రజలను అధికారులు ఇక్కడి నుంచి సురక్షితంగా బయటకు తరలించారు. కాలనీ మొత్తం ఇంకా అంధకారంలోనే ఉండిపోయింది.
నగర శివారులోని బాలాపూర్ గుర్రం చెరువు కట్ట తెగడం వల్ల బాబానగర్ ప్రాంతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ నిండా వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహంలో భారీగా వాహనాలు కొట్టుకెళ్లి తుక్కుగా మిగిలిపోయాయి. ప్రస్తుతానికి వరద నీరు ఖాళీ అయినప్పటికీ నష్టం భారీగా జరిగింది. గుర్రం చెరువు, పల్లె చెరువులకు తెగిన కట్టల మరమ్మతులు పూర్తయ్యాయి. వర్షం వచ్చినా చెరువుల నుంచి నీరు బయటకు రాకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.
ఇదీ చూడండి: వరద నుంచి త్రుటిలో తప్పించుకున్న 8 మంది