అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఇకపై ‘డయల్ 112’ వినియోగంలోకి రానుంది. అమెరికాలోని 911 తరహాలో మన దేశవ్యాప్తంగా ఒకే అత్యవసర నంబర్ ఉండాలని రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రాచుర్యం కల్పించాలంటూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ ఏడాది ప్రారంభంలో ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఒకటి, రెండు నెలల్లో డయల్ 112పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.
రెండు నెలల వరకూ పాత నంబరే..
- రెండు నెలల వరకూ ప్రజలు, బాధితులు డయల్ 100కు ఫోన్ చేసినా 112 నంబర్‌కు అనుసంధానమయ్యేలా చేస్తారు.
- ఈ నెల చివరి వారంలోపు డయల్ 112కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్‌శాఖ అధికారులు, కంట్రోల్ రూంలకు నేర్పించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
- సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా డయల్ 112పై అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ కూడళ్ల వద్ద సూచికలపై ప్రచార చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు.
- ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా డయల్ 100కు ఫోన్ చేస్తే.. 10 నిమిషాల్లో అత్యవసర స్పందన బృందం (ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) సంఘటన స్థలాలకు చేరుకుంటోంది. ఈ సమయాన్ని పట్టణ ప్రాంతాల్లో 8 నిమిషాలకు తగ్గించనున్నారు.
కర్ణాటక, తమిళనాడుల్లో ప్రత్యేక కంట్రోల్ రూంలు
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ ఏడాది ప్రారంభం నుంచి డయల్ 112పై ప్రచారం చేపట్టాయి. వందల మంది ఒకేసారి ఫోన్ చేసినా స్వీకరించేలా ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశాయి. సామాన్యులకు అవగాహన కలిగేందుకు కర్ణాటకలో పోలీస్ వాహనాలపై 112 స్టిక్కర్లను అతికించారు. కూడళ్ల వద్ద ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై, మదురై నగరాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్రలో వీలైనంత త్వరగా డయల్ 112ను అందుబాటులోకి తీసుకువస్తామని ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి ఎస్.పటేల్ ఇటీవల ప్రకటించారు.
112 ఎందుకు?..
అమెరికా, ఐరోపా దేశాల తరహాలో అత్యవసర సేవల కోసం వివిధ దేశాలు దేశవ్యాప్తంగా ఒకే నంబరును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాయి. మన దేశంలోనూ ఇలాంటి నంబరు ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచించింది. ప్రస్తుతం మనం పోలీస్‌కు 100, అంబులెన్స్‌కు 108, అగ్నిమాపక శాఖకు 101 ఉపయోగిస్తున్నాం. వీటన్నింటితో పాటు.. విపత్తు నివారణ, గృహహింస, వేధింపుల బాధితులకు సేవలందించేందుకు ఒకే నంబరు ఉండాలని నిర్ణయం తీసుకుంది.
అన్ని రాష్ట్రాలతో సంప్రదించిన అనంతరం రెండేళ్ల క్రితం 112 నంబరును వినియోగించాలని సూచించింది. సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పుల కారణంగా నాలుగైదు రాష్ట్రాలు మినహా ఎక్కడా 112 నంబరు అమలు కావడం లేదు. దీంతో హోం మంత్రిత్వశాఖ గతేడాది చివర్లో అన్ని రాష్ట్రాలను సంప్రదించి మార్చిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానించింది. అప్పటి నుంచి ప్రజలు, బాధితులు 100, 108, 101 ఇలా ఏ అత్యవసర సేవలకు ఫోన్ చేసినా దానంతట అదే 112కు అనుసంధానమవుతోంది. ఈ ఏడాది అక్టోబరు నాటికల్లా అన్ని అత్యవసర సేవలకు 112 నంబరుకు కాల్ చేసేలా చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చూడండి: