NTR Educational Trust: నందమూరి తారకరామారవు స్మృతిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుచెప్పగానే ముందుగా గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ, బ్లడ్ బ్యాంక్ సేవలు. ఐతే అంతకు మించి వేలమంది విద్యార్థుల పాలిట వరంగా ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ మారుతోంది. పాఠశాల విద్య నుంచి సివిల్స్ ప్రిపరేషన్ వరకు అన్ని రకాలైన విద్యను బోధిస్తోంది. గండిపేటలోని ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్లో సుమారు 900 మంది విద్యార్థులు తమ చదువులను కొనసాగిస్తున్నారు. సుమారు 10 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ ఇనిస్టిట్యూట్లో సీబీఎస్సీ సిలబస్‌తో ఓ పాఠశాల, ఇంటర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 2005 నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ పాఠశాల విద్య కోసం స్కూల్ ఏర్పాటు చేశారు.
బాలికల విద్యను ప్రోత్సహించడం:
2015 నుంచి ప్రత్యేకించి బాలికల విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులతో కళాశాలలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. విద్యార్థుల కోసం హాస్టల్ వసతితో పాటు.. సువిశాలమైన తరగతి గదులు, అడ్వాన్స్ కంప్యూటర్ ల్యాబొరేటరీ, వందల పుస్తకాలతో గ్రంథాలయం, ఎన్సీసీ, ఆర్గానిక్ వ్యవసాయం వంటి వాటిలో శిక్షణ ఇస్తున్నామని అకాడమిక్ డీన్ డా. రామారావు తెలిపారు. ఏటా పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ సత్తా చాటుతోందన్నారు.
ఇక ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు మెరిట్ ఆధారంగా స్కాలర్ షిప్ లు అందించటంతోపాటు డిగ్రీ మొదటి ఏడాది నుంచి సివిల్స్ , క్యాట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షల ఆధారంగా విద్యార్థినులను ఎంపిక చేసుకోవటంతోపాటు, అర్హులైన వారికి స్కాలర్ షిప్‌లు అందించి వారికి మరింతగా ప్రోత్సహిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్‌తో పాటు, సివిల్స్ శిక్షణ:
ఎన్టీఆర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ పదో తరగతి నుంచి డిగ్రీ విద్యతో పాటే ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అందిస్తోంది. సివిల్స్ లో రాణించాలనుకునే వారి కోసం 2019లో జూబ్లిహిల్స్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎక్సెల్ పేరుతో సివిల్స్ కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించింది. సాధారణంగా సివిల్స్ కోసం సన్నద్ధమయ్యే వారు ఎక్కువగా దిల్లీలో శిక్షణ తీసుకుంటారు. అయితే పేద, మధ్యతరగతి వారికి సైతం ఆ స్థాయి శిక్షణ అందించే లక్ష్యంతో రూపుదిద్దుకున్న ఎక్సెల్ అకాడమిలో ఏటా 30మందికి శిక్షణ ఇస్తున్నారు.
అతి తక్కవ ఫీజులతో దిల్లీ స్థాయిలో శిక్షణ ఇవ్వటంతోపాటు సివిల్స్... ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ లకు సన్నద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన ఓ అడ్వైజరీ బోర్డ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థుల సందేహాలను తీర్చేందుకు వారి సహాయం తీసుకుంటున్నారు. దిల్లీ కంటే ఇక్కడ మెరుగైన విద్యతో పాటు, నాణ్యమైన వసతులు, ఫీజులు సైతం తక్కువేనని ఎక్సెల్ సివిల్స్ అకాడమీ డైరక్టర్ కె. రాజేంద్రకుమార్ తెలిపారు. 9 నెలల ఈ శిక్షణ సమయంలో ఏడు నెలల పాటు విద్యార్థులకు సివిల్స్ సంబంధించిన అన్ని అంశాలను బోధిస్తారు. ఎప్పటికప్పుడు వారికి మాక్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులు ఎక్కడ వెనకబడుతున్నారో గుర్తించి వారిని తిరిగి ఆయా అంశాల్లో పట్టు సాధించేలా తీర్చిదిద్దుతన్నారు. సివిల్స్ ఇంటర్వ్యూకి 9మంది శిక్షణ పొందగా అందులో ఆరుగురు ఎంపికయ్యారు.
ఇవీ చదవండి: