కుటుబంసభ్యులతో సరదాగా గడపాలన్నా... భార్యాపిల్లలతో షాపింగ్ ప్రోగ్రాం పెట్టుకోవాలన్నా... ఫ్యామిలితో అలా బయటకు వెళ్లి డిన్నర్ చేయాలన్నా.. వ్యక్తిగత పనులేమైనా చేసుకోవాలన్నా... స్నేహితులను కలవాలన్నా.. ఓ రోజు విశ్రాంతి తీసుకోవాలన్నా.. దేనికైనా.. ఉద్యోగులకు వారాంతపు సెలవే దిక్కు. అలాంటిది.. పోలీసులకు మాత్రం కనీసం అది కూడా లేదు. పైనున్న పనుల్లో ఏది చేయాలన్న విధులకు సెలవు పెట్టాల్సిందే..! కరోనా కారణంగా ఆ సాధారణ సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవటం వల్ల.. కుటుంబంతో సమయం గడపలేక.. విధుల్లోనే కాలం గడిపేస్తున్నారు మన రక్షకభటులు.
ఎప్పటికప్పుడు వాయిదా...
సిబ్బంది కొరత పేరుతో పోలీసుశాఖలో వారాంతపు సెలవుల సదుపాయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి రోజంతా స్టేషన్‌కు సంబంధించిన విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. దీని వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పనిలో నాణ్యత లోపిస్తోందని భావించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇక్కడ వారాంతపు సెలవులు అమలు చేయాలని అధికారులు భావించారు. 2018 నాటికి 25 వేల మంది కొత్తగా పోలీసు శాఖలో కొలువులు పొందడంతో జిల్లాలు, కమిషనరేట్ల వారీగా వారాంతపు సెలవులు అమలు చేయాలని 2019 సెప్టెంబరులో డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వల్ల వీకాఫ్ కట్..
మొదట్లో కొన్ని నెలలు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. పని ఒత్తిడి పేరుతో వారాంతపు సెలవుల విధానాన్ని అధికారులు క్రమంగా నిలిపివేయడం మొదలుపెట్టారు. ఈలోపు కరోనా కలకలం మొదలైంది. 2020 మార్చి నెలలో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో దీని అమలు బాధ్యత పోలీసుశాఖపై పడింది. సరిపడా సిబ్బంది లేకకపోవడం వల్ల వారాంతపు సెలవులే కాదు సాధారణ సెలవులు కూడా లేకుండా పనిచేయాల్సి వచ్చింది. అప్పటి నుంచీ ఇదే తంతు కొనసాగుతోంది. కొవిడ్ బారినపడి దాదాపు వంద మంది పోలీసులు చనిపోయారు. కరోనా నెమ్మదించడంతో ఇప్పుడైనా మళ్లీ వారాంతపు సెలవుల విధానం అమలు చేయాలని పోలీసు సిబ్బంది కోరుతున్నారు.