మహా నగరంలోని అనేక ప్రాంతాలను వీధి దీపాల సమస్య వేధిస్తోంది. నిర్వహణ పనులను యంత్రాంగం నిర్లక్ష్యం చేయడంతో కాలనీల్లో చీకట్లు అలముకుంటున్నాయి. కొత్తగా ఏర్పాటుచేసే దీపాలు కొద్దికాలానికే పాడవడం, ఇంకొన్ని మిణుగురుల మాదిరి వెలగడం, చెట్ల కొమ్మల్లో చిక్కుకుపోవడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్కులు, శ్మశానాలు, శివార్లలోని మట్టి రోడ్లు, ఆర్‌యూబీలు, రైల్లే స్టేషన్ల రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో నడవలేని పరిస్థితి ఉందని పౌరులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దిశ ఘటన అనంతరం కొత్తగా ఏర్పడ్డ కాలనీల్లో వీధిదీపాల ఏర్పాటుకు నిర్ణయించిన అధికారులు.. ఆ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో చేరుకోలేదు. రోజూ సగటున 280 ఫిర్యాదులు అందుతుండటం సమస్యకు దర్పణం పడుతోంది.
పట్టించుకోని ఏజెన్సీలు
వీధి దీపాల నిర్వహణను జీహెచ్‌ఎంసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్‌ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సేవల సంస్థ)కు అప్పగించింది. ఆ సంస్థ డివిజన్లు, సర్కిళ్ల వారీగా ప్రైవేటు గుత్తేదారులకు ఇచ్చింది. అందులోని పలు ఏజెన్సీలు ఫిర్యాదులను పట్టించుకోవట్లేదు. బల్దియా అధికారులు సర్కిళ్లవారీగా పరిష్కరించాల్సి ఉండగా.. పలువురు ఇంజినీర్లు, సూపర్‌వైజర్లు బాధ్యత విస్మరిస్తున్నారు. మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌యాప్, బల్దియా కంట్రోల్ రూమ్(040-2111 1111) నంబరుకు అందుతున్న సమస్యలను పరిష్కరించకుండానే కొందరు మూసేస్తున్నారు. అలా ఎలా చేస్తారని పౌరులు నేరుగా ఫోన్ చేస్తే.. ఆ నంబర్లను బ్లాక్‌లిస్టులో పెడుతున్నారు. ఇటీవల కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఓ సూపర్‌వైజర్‌పై ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి.
జరిమానా ఉంటుంది..
వీధి దీపాలు వెలిగే శాతాన్ని జీహెచ్‌ఎంసీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. 98 శాతానికి తగ్గితే ఈఈఎస్‌ఎల్‌కు జరిమానా విధిస్తాం. అందులో భాగంగా మొదట్నుంచి ప్రతి నెలా చెల్లించే బిల్లులో 20 శాతం మొత్తాన్ని విడుదల చేయట్లేదు. నిర్వహణ లోపాలను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఆ సంస్థకు బకాయిలు చెల్లిస్తాం. లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం.’’ అని ఎలక్ట్రికల్ విభాగం ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.
ఎక్కడెక్కడ ఎలా ఉందంటే..
* ఖైరతాబాద్ జోన్‌లో ఎక్కువ సమస్యలు తలెత్తుతున్నాయి.
* నిర్వహణ చూసే గుత్తేదారులు, ఈఈఎస్‌ఎల్, బల్దియా మధ్య సమన్వయం లేక మెహిదీపట్నం, కార్వాన్, ఇతరత్రా సర్కిళ్లలో ప్రధాన రహదారులు చీకట్లో మగ్గుతున్నాయి.
* చార్మినార్ జోన్‌లోని ఉప్పుగూడ ఆర్‌యూబీ, లలితాబాగ్, గౌలిపుర, షంషీర్‌గంజ్, మిథాని నుంచి బాలాపూర్ వెళ్లే రోడ్డు(బీడీఎల్ రోడ్డు), ఎల్బీనగర్ జోన్‌లోని ప్రథమ్‌పుర్‌కాలనీ, ఓల్డ్ కాప్రా, హెచ్‌టీలైన్, నాచారంలోని రాఘవేంద్రనగర్, బాబానగర్, మల్కాజిగిరిలోని పలు కాలనీలు, చర్లపల్లి బీఎన్‌రెడ్డికాలనీలో సమస్యలపై జనం గగ్గోలు పెడుతున్నారు.
* ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని గాంధీనగర్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, ఇతరత్రా ప్రాంతాల్లో చెట్ల కొమ్మల వల్ల వీధి దీపాల వెలుగు రోడ్డుపై ప్రసరించటంలేదు.