BURIAL GROUND: ఆంధ్రప్రదేశ్లోని కడప జనాభా దాదాపు 4 లక్షలు. మరి అందుకు తగ్గట్టుగా శ్మశానాలు అందుబాటులో ఉన్నాయా అంటే.. లేవంటున్నారు ఇక్కడి ప్రజలు. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో 40 శ్మశాన వాటికలున్నాయి. ఇందులో 22 హిందూ, 13 ముస్లిం, 5 క్రిస్టియన్ శ్మశానవాటికలు. ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్నది సహా మోచంపేట, అశోక్ నగర్, కొండాయపల్లి, ఎస్వీ డిగ్రీ కళాశాల, మాచుపల్లి రోడ్డు శ్మశానవాటికలు సమాధులతో నిండాయి. 40 శ్మశాన వాటికల్లో నగర శివారు ప్రాంతాల్లో 13 మిగిలినవి జనావాసాల మధ్య ఉన్నాయి. 15 వాటికల్లో పరిస్థితి అత్యంత సమస్యాత్మకం.
కడప ఆర్టీసీ కొత్త బస్టాండు సమీపంలో హిందూ శ్మశానవాటిక దాదాపు ఆరెకరాల్లో ఉంది. అందులో రెండెకరాలు ఆక్రమణలో ఉండటం వల్ల ఇబ్బందులు తప్పట్లేదు. రాజంపేట బైపాస్ రోడ్డులోని శ్మశాన వాటికదీ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితికి కబ్జాదారులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్మశానాలు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
కడప శ్మశానవాటికల్లో స్థల సమస్య పరిష్కారానికి కొత్తగా వచ్చిన కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పాత సమాధుల్ని తొలగించి మృతిచెందిన వారి వివరాలను ఒక స్థూపంపై రాయించేలా చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. సున్నితమైన అంశం కావడం వల్ల అధికారుల చర్యలు ఏ మేరకు ఫలిస్తాయన్నది త్వరలో తెలుస్తాయని జనం అంటున్నారు.
ఇవీ చదవండి : 'ప్రధానిగా నన్ను ఎన్నుకుంటే.. లైంగిక నేరస్థుల అంతుచూస్తా'
కరకట్ట నిర్మించి శాశ్వత పరిష్కారం జరిగే వరకు పోరాడతాం: చంద్రబాబు