Telangana revenue offices: సాధారణంగా రెవెన్యూ కార్యాలయాల్లో పరిపాలనంతా దస్త్రాలతో ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిరాక్సులు, కంప్యూటర్లు, ప్రింటర్ల నిర్వహణకు భారీగా వ్యయం అవుతుంది. కార్యాలయాల పరిశుభ్రత తదితర అంశాలకు అయ్యే ఖర్చులు అధికం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తహసీల్దారు కార్యాలయాలకు అందుకు అనుగుణంగా నిర్వహణ నిధుల కేటాయింపులు లేకపోవడంపై రెవెన్యూ సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాలకూ సొంత డబ్బు ఖర్చుచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల పలు జిల్లాల్లోని నీటి వనరుల్లో పడి పదుల సంఖ్యలో బాధితులు మృతిచెందిన సందర్భాల్లో, గజ ఈతగాళ్లను రప్పించడం వంటి పనులకు స్థానిక రెవెన్యూ అధికారుల జేబులు ఖాళీ అయ్యాయి. మొత్తంగా ఏటా రూ.రెండు వేల కోట్ల రాబడిని తెచ్చిపెడుతున్న తహసీల్దారు కార్యాలయాలు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నాయని ఆ వర్గాలు వాపోతున్నాయి.
ఏడాదికి రూ.50 వేలు వస్తే గొప్ప: త్రైమాసికానికి ఒకసారి ప్రభుత్వం కోశాగారం (ట్రెజరీ) నుంచి నిర్వహణ నిధులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఏడాదికి నాలుగుసార్లు ఇలా బిల్లులు రావాల్సి ఉండగా మూడు దఫాలు మాత్రమే ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. వార్షిక అంచనా ప్రకారం సగటున ఒక్కో తహసీల్దారు కార్యాలయానికి సుమారు రూ.2 లక్షలు ఖర్చవుతుండగా, రూ.35 వేలకు మించి నిర్వహణ నిధులు రావడం లేదు.
పెద్ద మండలాల్లో గరిష్ఠంగా రూ.50 వేలు వస్తున్నాయి. ధరణి అమల్లోకి వచ్చిన తరువాత కార్యాలయాల్లో ఖాస్రా, పహాణీ, 1 బి ఇతర దస్త్రాల నకళ్లు తీయడం అనివార్యమైంది. ప్రతి దస్త్రం కలెక్టర్‌కు పంపాల్సి రావడంతో ప్రింటింగ్ యంత్రాల వినియోగం పెరిగింది. జిరాక్సుల కోసం నాణ్యమైన కాగితాలు జిల్లా కేంద్రం నుంచి తెప్పించడానికి రూ.వేలల్లో ఖర్చవుతోంది. ఇవన్నీ తమకు గుదిబండగా మారాయని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.
కార్యాలయం పరిశుభ్రత, మురుగుదొడ్ల నిర్వహణ, వాటిని శుభ్రంచేసే వారికి కలిపి ప్రభుత్వం నెలకు రూ.2 వేలు మాత్రమే కేటాయిస్తోందని, అందరం చందాలు వేసుకుని మరో రూ.3 వేలు చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బకాయిల భారం: తహసీల్దారు కార్యాలయాలకు బకాయిలు కూడా పెరిగాయి. ప్రైవేటు జిరాక్సు కేంద్రాలకు ఒక్కో కార్యాలయం తక్కువలో తక్కువ రూ.50 వేలు బకాయి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కార్యాలయానికి వచ్చినప్పుడు తేనీరు, అల్పాహారం, ఇతర ఖర్చులు అదనం. ధరణి ఆరంభంలో మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లకు రూ.10 లక్షలు కేటాయించినా కరోనా ఫ్రీజింగ్ పేరుతో చాలా జిల్లాలకు సగం నిధులు కూడా విడుదల చేయలేదు. ధరణి నిర్వహణకు ప్రత్యేక బడ్జెట్ లేదు.
కొన్ని జిల్లాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు పెట్టడంతో వాటిని రీఛార్జి చేసుకునేందుకు నిధులు లేక అప్పులు తెచ్చిమరీ నెట్టుకొస్తున్నాం. ప్రభుత్వం నుంచి బడ్జెట్ ఎప్పటికప్పుడు వస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదని, రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
సగటున ఒక్కో తహసీల్దారు కార్యాలయ నెల ఖర్చు:
* ధరణి విభాగం, కార్యాలయ ప్రింటర్ల క్యాట్రేజ్‌లు (ఒక్కోటి రూ.300) 10 : 3,000
* కంప్యూటర్లు, ఇతర పరికరాల నిర్వహణ: 2,000
* పేపరు బండిళ్లు (ఒక్కోటి రూ.300) 10: 3,000
* ఐరిస్ ఇతర అప్‌లోడ్‌కు అవసరమయ్యే ఇంటర్నెట్‌కు: 1,500
* కార్యాలయం శుభ్రపరిచే స్కావెంజర్‌కు: 5,000
* ప్రైవేటు కేంద్రాల్లో జిరాక్సులు తీయించేందుకు: 5,000
ఇవీ చదవండి: