అయిదేళ్లలోపు చిన్నారులకు ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఉచిత టీకాలను ప్రతి బుధ, శనివారాలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బి.సి.జి, పోలియో, డిఫ్తీరియా, హెపటైటిస్-బి, మీజిల్స్ తదితర 7 రకాలు ఉంటాయి.. ప్రైవేటులో చాలా వ్యయంతో కూడుకున్న పని. చాలామంది పేద, మధ్యతరగతి కుటుంబాలు సర్కారునే నమ్ముకున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది చిన్నారులకు వీటిని అందిస్తుంటారు.
సౌకర్యాలు కానరావు..
నగరంలో 85 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఖైరతాబాద్, చింతల్‌బస్తీ, ముషీరాబాద్, బోయినపల్లి, సీతాఫల్‌మండి, రంగారెడ్డి పరిధిలోని అత్తాపూర్, రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, పాతబస్తీలోని పలు కేంద్రాల్లో వసతులు లేవు. ఆసుపత్రుల సిబ్బందికి సరైన బాత్‌రూంలు లేవు. ఉన్న చోట నిర్వహణ సరిగా లేదు. ఇక బస్తీల్లో టీకాలపై అవగాహన లేక 70 శాతం లోపే ముందుకొస్తున్నారు. బూస్టర్ డోస్‌లు ఇప్పించకపోవడం వల్ల చాలామంది డిఫ్తీరియా బారిన పడుతున్నారు. ఫీవర్ ఆసుపత్రికి ఈ కేసులు అధికంగా వస్తున్నాయి.