తొలిదశలో మానవాళిని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారి... రెండో దశలో అంతకుమించి అలజడి సృష్టిస్తోంది. రాకాసికాటుకు నిత్యం ఎన్నో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఎంతో మంది మృత్యువుతో పోరాడుతున్నారు. కరాళ నృత్యం చేస్తున్న కరోనాకు... ప్రజల నిర్లక్ష్యధోరణి తోడవటంతో... ఆస్పత్రుల్లో కనీసం పడకలు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుంది. ఒకవైపు ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు దవాఖానాల తలుపు తడుతుంటే... సరదాలే ముఖ్యమన్నట్లుగా కనీస జాగ్రత్తలు మరిచి, మరికొందరు సినిమా టాకీస్ల చుట్టూ తిరుగుతున్నారు.
ఎగబడుతున్నారు..
మెడికల్‌షాపులో మందులు కొనట్లేదు. దుకాణాల్లో సరకులు కొనటంలేదు. సినిమా టాకీస్‌లో మాత్రం మీదమీదపడుతూ టికెట్లు కొంటున్నారు. భౌతిక దూరం అసలే లేదు. కొందరికి మాస్కులే ఉండటం లేదు. థియేటర్ ఆవరణలో కొందరు జాతక చక్రాలు చెప్పించుకుంటున్నారు. భవిష్యత్ గురించి అంత బెంగ పట్టుకున్న సదరు ప్రబుద్ధునికి మాస్కు పెట్టుకుంటే కరోనా గండం నుంచి బయటపడొచ్చు అని చెప్తే బాగుండు. కానీ... ఆ చెప్పేటాయన కూడా మాస్కు సరిగా పెట్టుకుంటే కదా... చెప్పేది. మరికొందరైతే... టాకీస్ ముందే కాయ్ రాజా కాయ్ అంటూ... కరోనాతో ఆటాడుతున్నారు.
జాగ్రత్తలు మరిచారు..
సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు.... థియేటర్‌లో మాస్కు ధరించటం, భౌతికదూరం, శానిటైజేషన్ వంటి వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. కరోనా మొదటిదశలో... దేశవ్యాప్తంగా గతేడాది మార్చి నుంచి అక్టోబర్ వరకు సినిమాహాళ్లు మూతబడ్డాయి. తర్వాత కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల రాష్ట్రంలో నవంబర్ నుంచి క్రమంగా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. 50శాతం సీట్లతో మాత్రమే థియేటర్లు నడపాలని మొదట్లో ఆదేశించిన సర్కారు.. ఈ ఫిబ్రవరి నుంచి వంద శాతం సీట్లను వినియోగించుకునేందుకు అనుమతులిచ్చింది. అనంతరం, వరసగా సినిమాలు విడుదల కావటంతో... జనాలు థియేటర్లకు బారులు తీరారు. కరోనా తొలిదశ అనంతరం, వైరస్ విజృంభణ తగ్గటంతో ప్రజలు జాగ్రత్తలను మరిచారు. సినిమా థియేటర్లకు వచ్చే వారిలో.... చాలా వరకు మాస్కులు ధరించటంలేదు. భౌతికదూరం పాటించకుండానే గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు.
జిల్లాల్లో నిర్లక్ష్యం...
హైదరాబాద్‌లో కొంతవరకు మాస్కులు ధరిస్తున్నా... జిల్లాల్లో మాత్రం కరోనా జాగ్రత్తలు పట్టించుకోవటంలేదు. హాల్‌లో 100 శాతం సీట్ల ఆక్యుపెన్సీకి అనుమతులు ఉన్నందున భౌతికదూరానికి అవకాశమేలేకుండా పోయింది. సినిమా హాళ్లో దాదాపు రెండున్నర నుంచి మూడు గంటలపాటు సామూహికంగా కూర్చోవటం... కరోనా వ్యాప్తికి మరింత ఆజ్యం పోస్తోంది.
నిబంధనలు గాలికే...
కరోనా కట్టడికి ప్రభుత్వాలు కఠిన ఆదేశాలు జారీ చేసినా.... కొందరు థియేటర్ల యజమానులు వాటిని లెక్కచేయడం లేదు. కొత్త సినిమాల విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద పెద్దఎత్తున సందడి నెలకొంటుంది. భౌతిక దూరం, మాస్కులు ధరించకుండా..... సినిమాలను వీక్షించేందుకు జనం తరలివస్తున్నారు. ప్రతి షోకు శానిటేషన్, థర్మామీటర్ చెకింగ్, సినిమాకు వచ్చే ప్రతి వ్యక్తికి మాస్క్ అందించాలనే నిబంధన ఉన్నా... ఇవేమీ పట్టనట్లుగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మార్గదర్శకాలు సూచించినా... వ్యాక్సినేషన్ ఎంత వేగంగా జరిగినా... కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కాకపోతే వైరస్‌ను అడ్డుకోవటం అసాధ్యంగా నిపుణులు పేర్కొంటున్నారు.