వానాకాలం (ఖరీఫ్) సీజన్ ప్రారంభమై రెండు వారాలవుతున్నా రైతుబంధు సొమ్ము ఎప్పుడిస్తారు, ఎంతమందికిస్తారనే వివరాలను వెల్లడించకుండా వ్యవసాయశాఖ గోప్యత పాటిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయశాఖ ఖాతాలో రూ. 5వేల కోట్లు జమ చేసింది. వాటిని రైతుల ఖాతాల్లో వ్యవసాయశాఖ జమ చేయడమే తరువాయి. ఈ సొమ్ము వచ్చిందా, ఎప్పుడొస్తుందంటూ బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ గ్రామాల్లో రైతులు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 61.13 లక్షల కమతాలున్నాయని, వాటిలో 59 లక్షల కమతాలకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇప్పటికే పంపిణీ చేసినట్లు రెవెన్యూశాఖ చెబుతోంది. అంటే 59 లక్షల మంది రైతుల వివరాలు రెవెన్యూశాఖ ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు అర్థం. ఈ శాఖ ఇచ్చిన సమాచారాన్ని జాతీయ సమాచార కేంద్రానికిచ్చి (ఎన్‌ఐసీ) వ్యవసాయశాఖ పరిశీలిస్తోంది. మొత్తం 51,43,894 మంది రైతుల పాసుపుస్తకాల వివరాలను వ్యవసాయశాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
5.65 లక్షల మంది వివరాల నమోదు..
పట్టాదారు పాసుపుస్తకంతో ఆధార్, బ్యాంకు ఖాతా సంఖ్య అనుసంధానమై ఉన్న రైతులకే రైతుబంధు సొమ్ము జమ చేస్తారు. గత జనవరి నెలాఖరు నాటికి రెవెన్యూ శాఖ నుంచి పాసుపుస్తకాలను పొందిన రైతులకే ఈ సీజన్‌లో రైతుబంధు సొమ్ము వేస్తామని వ్యవసాయశాఖ తెలిపింది. సుమారు 5.65 లక్షల మంది ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు అనుసంధానం కాలేదు. వీరి వివరాలను మళ్లీ సేకరించాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈఓలకు) వ్యవసాయశాఖ సూచించింది. గత జనవరి నెలాఖరు నాటికి పాసుపుస్తకాలున్న వారందరి వివరాలు నమోదు చేయాలంది. ‘ఎంతమందికి డబ్బు జమ చేస్తారు? ఎప్పుడు వేస్తారు? ఎంత విస్తీర్ణం వరకు వేస్తారో వ్యవసాయశాఖ అధికారికంగా వెల్లడిస్తే రైతుల్లో ఆందోళన ఉండద’ని కొందరు ఏఈఓలు పేర్కొంటున్నారు.
ఇవీ చూడండి: 'రాష్ట్ర సాధన ఆశయం నెరవేరాలంటే కాంగ్రెస్ సర్కార్ రావాల్సిందే'