నివర్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని చెరువులకు పూర్తి స్థాయిలో నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో రోడ్లపై నీరు పొంగు పొర్లుతోంది. ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. రామానుజపల్లె చెరువుకు రంధ్రం పడి నీరు పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఇసుక బస్తాలతో ఆ ప్రాంతాన్ని నింపి గండి పడకుండా స్థానికులు అడ్డుకట్ట వేశారు. వరద ప్రవాహం ధాటికి పంట పొలాల్లో వరినాట్లు నీట మునిగాయి.
స్వర్ణముఖి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పలు చోట్ల కాజ్ వే పై నుంచి నీరు ప్రవహిస్తోంది. స్వర్ణముఖి నదిలోకి నీటి ప్రవాహం ప్రస్తుతం 1400 క్యూ సెక్కులుగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నందున.. పరిసర ప్రాంతాలకు ప్రజలు నదివైపు వెళ్లరాదని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి: 'విద్వేషాలు రెచ్చగొట్టే వారికి నగరంలో చోటులేదు'