గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన నిర్మల, ఖుష్బూ అత్తాకోడళ్లు. నిర్మల గత 35 ఏళ్లుగా కుట్టు పని చేస్తోంది. కోడలు కూడా అత్త బాటలోనే నడుస్తోంది. కరోనా సమయంలో ఎందరో ఉపాధిని కోల్పోయారు. తిండి లేక పస్తులుంటున్నారు. కొవిడ్ వచ్చినవారి పరిస్థితి మరీ దారుణం. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లభించక వారు పడుతున్న కష్టాలను చూస్తుంటే కంట నీరు రావాల్సిందే. ఇవన్నీ చూసి ఆ అత్తాకోడళ్ల మనసు చలించింది. బాధితులకు చేతనైనంత అండగా నిలవాలని అనుకున్నారు. తాము దాచుకున్న సొమ్ముతో ఆక్సిజన్ సిలిండర్లను కొని అవసరమైన వారికి అందిస్తున్నారు.
అడిగిన వారికి లేదనక...
కొవిడ్ రోగుల కోసం నిర్మల 74 వేల రూపాయల విరాళాన్ని కలెక్టర్‌కు పంపితే.. ఆయన వాళ్ల గురించి తెలుసుకుని ఆశ్చర్య పోయారు. ఫోన్ చేసి అంతే ఎందుకు పంపారు అని అడిగారు. స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు అయ్యింది కదా అందుకు గుర్తుగా అని చెప్పారట నిర్మల. ‘ఈ కష్ట సమయంలో ఎంతో మంది సేవ చేస్తున్నారు. మేం కూడా ఎంతో కొంత ఆర్థికంగా అండగా నిలవాలని అనుకున్నాం’ అని చెబుతోంది ఖుష్బూ. కొవిడ్ నుంచి కోలుకున్న వారు, కొందరు దాతలు కూడా ఈ అత్తాకోడళ్లకు అండగా నిలుస్తున్నారు. సాయం కోసం ఎవరొచ్చినా.. లేదనకుండా నిత్యావసర సరకులు అందిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్లైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నారు.
సంకల్పం ఉంటే చాలని..
‘వాలంటీర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్నారు. ఎంతోమంది మాకు అండగా నిలుస్తూ.. మా ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. సంకల్పం ఉన్న మహిళ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోగలదు’ అని అంటున్నారీ ఈ అత్తాకోడళ్లు.
ఇదీ చూడండి: విద్యార్థుల భావోద్వేగ నైపుణ్యాలకు పదును