శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని ప్యానెల్స్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ప్రమాదం జరిగిందని విద్యుత్ శాఖ ప్రకటించింది. ఘటనలో 9 మంది మృతిచెందినట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలు వెలికితీయ్యగా.. మిగతా ఇద్దరి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది బయటకు తీసుకువస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు ఉద్యోగులు చికిత్స పొందుతున్నట్లు విద్యుత్ శాఖ తెలిపింది.
మృతులు డీఈ శ్రీనివాస్ (హైదరాబాద్), ఏఈలు వెంకట్‌రావు (పాల్వంచ),ఏఈలు మోహన్‌కుమార్, ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్), సుందర్ (సూర్యాపేట), జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేశ్, మహేశ్ (హైదరాబాద్)గా గుర్తించారు. సహాయక చర్యల్లో సీఐఎస్‌ఎఫ్, ప్రత్యేక బృందాలు పాల్గొన్నాయి. దట్టమైన పొగలు అలముకోవడంతో పలువురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అస్వస్థతకు గురవుతున్నారు.
ఏం జరిగిందంటే..!
కలిగిన శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో గత రాత్రి పదిన్నర సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని వెల్లడించింది. మంటలను పసిగట్టిన ఉద్యోగులు ఆర్పేందుకు అన్నిప్రయత్నాలు చేసినట్లు వెల్లడించింది. మంటల్లో కాలిపోకుండా ప్లాంట్‌ను రక్షించేందుకు ఉద్యోగులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రయత్నించారని వివరించింది. రాత్రి 12 గంటల వరకు ఉద్యోగులు ప్రయత్నాలు కొనసాగించారని ఐనా లాభం లేకుండా పోయిందని తెలిపింది. రాత్రి 12 గంటల సమయంలో ఉద్యోగులు ప్లాంట్ నుంచి జరిగిన ప్రమాదంపై సమాచారమందించారు. మంటలు ఎగిసిపడి, పొగలు కమ్ముకోవడంతో ఆపదలో చిక్కుకున్నట్లు కుటుంబసభ్యులకూ ఫోన్ చేసి చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 17 మంది ఉద్యోగులు అక్కడ ఉండగా.. అందులో ఎనిమిది మంది సురక్షితంగా బయటకు వచ్చినట్లు విద్యుత్ శాఖ తెలిపింది. మిగిలిన తొమ్మిది మంది అక్కడే చిక్కుకున్నారు. వారంతా జెన్‌కో కు చెందిన డీఈ శ్రీనివాస్‌గౌడ్, ఏఈలు వెంకట్‌రావు, మోహన్‌కుమార్, ఉజ్మ ఫాతిమా, సుందర్, ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, జూనియర్ అటెండెంట్ కిరణ్, ఓ ప్రైవేట్ బ్యాటరీ కంపెనీకి చెందిన వినేష్ కుమార్, మహేష్ కుమార్ ఉన్నారు. ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు రావడానికి ప్రయత్నం చేసినా.. దట్టమైన పొగల వల్ల సాధ్యం కాలేదని వివరించింది.
1.2 కిలోమీటర్ల లోతులో ప్లాంట్..
ప్రమాదం సమాచారం తెలుసుకున్న వెంటనే విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, జెన్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, అగ్నిమాపక సిబ్బంది ప్లాంట్ దగ్గరికి చేరుకుని మంటలు, పొగలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఐతే 1.2 కిలోమీటర్ల లోతులో ప్లాంట్ ఉంది. అక్కడికి చేరుకోవడానికి సొరంగ మార్గం మాత్రమే ఉండటం వల్ల మంటలు, పొగలు కమ్ముకోవడం వల్ల చాలాసేపటి వరకు లోపటికి వెళ్లడం సాధ్యం కాలేదని వివరించింది. మధ్యాహ్నం ప్లాంట్‌లోకి ప్రవేశించడం సాధ్యమైనా అక్కడ చిక్కుకున్న 9 మంది దురుదృష్టవశాత్తు మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఉద్యోగులు చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి: 'ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు బయటకు రావాలి'