నదులు, జలాశయాలు, ఇతర నీటి వనరుల్లో ఇసుక తవ్వకాలు, పూడికతీతకు ముందుగానే సమగ్ర అధ్యయనం చేయించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించింది. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ శాశ్వత నిపుణుల మదింపు కమిటీని నియమించాలని ఆదేశించింది. గోదావరి, కృష్ణా నదుల్లో ఇసుక తవ్వకాలపై తిరుమలశెట్టి శ్రీనివాస్, దేవినేని రాజశేఖర్ వేర్వేరుగా దాఖలు పిటిషన్లను ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారించింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీచేసింది. వీటిని ప్రభుత్వం పాటించాలంటూ... రెండు కేసుల విచారణ ముగించింది.
ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు ఇవీ:
- ఇసుక తవ్వకాలకు సంబంధించి అనుమోలు గాంధీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఎన్జీటీ గతంలో ఇచ్చిన ఆదేశాలను, 2020 జనవరిలో ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్, మానిటరింగ్ మార్గదర్శకాలను పాటించాలి.
- పూడికతీత, ఇసుక తవ్వకాలపై నింయత్రణ, నిర్వహణకు అవసరమైన సౌకర్యాలను, సాంకేతిక వసతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించాలి. ఇసుక, ఖనిజాలు తవ్వకాల ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాలి. ఖనిజం రవాణాలో పక్కదారి పట్టకుండా చూసేందుకు ఆ వాహనాలను జీపీఎస్ కల్పించాలి.