విశ్వవిద్యాలయాలకు నేడో, రేపో ఉపకులపతులు రాబోతున్నారు. వీసీల నియామకానికి సంబంధించిన దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. గవర్నర్ ఆమోదించగానే ఉత్తర్వులు వెలుపడే అవకాశముంది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్, శాతవాహన, అంబేడ్కర్, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలుగు యూనివర్సిటీలకు వీసీలను నియమించనున్నారు. యూనివర్సిటీలకు 2019 జూన్ నుంచి ఐఏఎస్ అధికారులు ఇంఛార్జి వీసీలుగా కొనసాగుతున్నారు.
వీసీల నియామకానికి 2019 జులైలోనే దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు 150 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. నియామక ప్రక్రియ వేగంగా జరగపోవడంపై విద్యావేత్తలతో పాటు గవర్నర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో అన్వేషణ కమిటీలు ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాయి. ఒక్కో యూనివర్సిటీకి ముగ్గురు పేర్లను సీఎం కార్యాలయానికి పంపించాయి. వరుస ఎన్నికలు, కరోనా ప్రభావం వల్ల ప్రక్రియ మళ్లీ నిలిచిపోయింది.
ముగ్గురు పేర్లతో కూడిన దస్త్రంపై సీఎం కేసీఆర్ సంతకం చేసి గవర్నర్ కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తోంది. గవర్నర్ తుది ఎంపిక చేశాక... నేడో, రేపో ఉత్తర్వులు జారీ కావచ్చునని భావిస్తున్నారు.