- రెండో డోస్ వేసుకుందామంటే దొరకడం లేదు. మొదటి డోస్ వేసుకుంటే సరిపోదు.. కరోనా వస్తుందని అంటున్నారు.
సమాధానం: రెండో డోస్ కాస్త ఆలస్యమైనా నష్టం జరగదు. మొదటి డోసు తర్వాత రోగ నిరోధక శక్తిని ఉద్దీపణ చేయడానికి రెండో డోసు తీసుకుంటున్నాం. ఆరోగ్యంగా ఉన్నవారిలో మొదటి డోస్‌కే వ్యాధి నిరోధకాలు తయారవుతాయి. ఆరోగ్యం సరిగా ఉండనివారికి, వ్యాధి నిరోధకాలు ఆలస్యంగా తయారవుతాయి. అందుకే రెండో డోసు తీసుకోవాలి.
- కుటుంబ పెద్దను కావడంతో టీకా వేసుకోవద్దని కుమార్తెలు, కుమారులు చెబుతున్నారు? ఏం చేయాలో అర్థం కావడం లేదు..?
స: పెద్దవాళ్లు తప్పకుండా టీకా వేసుకోవాలి. వారిలో వ్యాధి నిరోధకాలు సహజంగా తయారుకావు. టీకా వేసుకున్న తర్వాత ఒళ్లు నొప్పులు, జ్వరం రావడం సహజమే దానికి భయపడాల్సిన అవసరం లేదు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. చాలా మంది టీకా తీసుకుని వాకింగ్, వ్యాయామం చేస్తున్నారు. అవసరమైతే టీకా తీసుకున్న రోజు విశ్రాంతి తీసుకోవాలి. ముఖ్యంగా పెద్దవాళ్లు బీపీ, మధుమేహంతో బాధపడేవాళ్లు టీకా తీసుకోకపోవడంతో ఇన్‌ఫెక్షన్‌తో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. టీకా తప్పకుండా రక్షణ అందిస్తుంది.
- వైరస్ బారిన పడి మృతి చెందిన వ్యక్తుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా..?
స: చనిపోయిన వారిలో వైరస్ అక్కడే చనిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్లిన సమయంలో గుంపులుగా చేరడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతుంది. చనిపోయిన వ్యక్తుల ద్వారా వైరస్ వ్యాప్తి జరగదు.
- ఇటీవలే పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. పరిస్థితి చేయిదాటి ఆసుపత్రిలో బెడ్ దొరక్కపోతే ఎలా..? అని భయమేస్తోంది
స: ఆసుపత్రుల్లో బెడ్ దొరకదేమో అనే ఆలోచన ఎందుకు...? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో సదుపాయాలు ఉన్నాయన్న విషయాన్ని మరవద్దు. పాజిటివ్ వ్యక్తులు టిమ్స్, గాంధీ ఆసుపత్రులకి వెళ్తే అక్కడి వైద్య నిపుణులు చక్కని సేవలందిస్తున్నారు. ఆసుపత్రిలో బెడ్ అవసరం పడుతుందన్న నెగెటివ్ ఆలోచనలు అనవసరం.
- కొవిడ్‌ను జయించిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు...? అది మరింత భయాన్ని పెంచుతోంది.
స: కరోనాను జయించిన తర్వాత శరీరం అలసిపోతుంది. ఈ సమయంలో మంచి ఆహారం, నిద్ర అవసరం. అందుకే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు. మళ్లీ కరోనా వస్తుందన్న భయం అనవసరం. వచ్చి తగ్గిన వారికి వ్యాధి నిరోధకాలు ఉంటాయి.. అంత భయంగా ఉంటే యాంటీబాడీస్ ఉన్నాయా అని పరిశీలించుకోవాలి. యాంటీబాడీస్ లేక పోతే జాగ్రత్తగా ఉండాలి తప్ప అనుమానంతో లేనిపోని జబ్బులు వస్తాయి.