Nellore Court Theft: ఏపీ నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై హైకోర్టులో సుమోటో విచారణ జరిపింది. కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదని అడ్వకేట్ జనరల్(ఏజీ) కోర్టుకు తెలిపారు. దీంతో డీజీపీ, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీబీఐ డైరెక్టర్, సీఎస్‌లకు నోటీసులు జారీ చేసింది. కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపిని ఆదేశించింది. కేసు దర్యాప్తు నివేదిక పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపినట్లు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు మే 6కు వాయిదా వేసింది.
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి చోరీకి గురైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రాష్ట్ర హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని ఉన్నత న్యాయస్థానం సుమోటో పిల్‌గా పరిగణించి ఇవాళ విచారణ జరిపింది.