Neeraj Murder Case Accused Parents : హైదరాబాద్ బేగంబజార్ వ్యాపారి నీరజ్ హత్య కేసులో నిందితుల తల్లిదండ్రులు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. నీరజ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న తమ పిల్లలకు రక్షణ కల్పించాలని హెచ్‌ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలు ఆరుగుర్ని రిమాండ్‌కు తరలించారని.. విచారణ పేరుతో కస్టడీకి తీసుకున్నారని తెలిపారు.
- ఇదీ చదవండి : 'టెక్నాలజీకి గత పాలకులు దూరం- పేదలకు నష్టం'
వారిని లాకప్ డెత్‌లోనో.. లేదా ఎన్‌కౌంటర్‌లోనో చంపేస్తారని అనుమానముందని హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. తమ పిల్లలకు రక్షణ లేదని.. విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఆ ఘటనలో ప్రమేయం లేని వారిపైనా కేసులు పెడుతున్నారని అన్నారు. కస్టడీలో చట్టబద్ధంగా విచారణ చేయాలని హెచ్‌ఆర్సీని కోరారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనందన్‌ను కూడా కలుస్తామని తెలిపారు.
"మా పిల్లల ప్రాణాలకు పోలీసుల నుంచి ముప్పు ఉంది. విచారణ పేరుతో వారిని లాకప్ డెత్ చేస్తారేమోనని భయంగా ఉంది. కస్టడీలో పేరుతో ఎన్‌కౌంటర్ చేస్తారని అనుమానంగా ఉంది. వాళ్ల రక్షణ కోసం హెచ్‌ఆర్సీని ఆశ్రయించాం. మా పిల్లలను ఎన్‌కౌంటర్ చేస్తారనే విషయం తెలిసింది మాకు. దయచేసి వాళ్లని రక్షించండి. విచారణ పేరుతో మా ఇళ్లలోకి పోలీసులు ఎప్పుడుపడితే అప్పుడు వస్తున్నారు. మమ్మల్ని ఇళ్ల నుంచి వెళ్లిపోమని చెబుతున్నారు. మాకు ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు." -- నీరజ్ హత్య కేసు నిందితుల తల్లిదండ్రులు
పోలీసుల కస్టడీకి ఇద్దరు: బేగంబజార్‌లో జరిగిన నీరజ్ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయ్, సంజయ్ అనే ఇద్దరు నిందితులను కోర్టు 4రోజుల కస్టడీకి అనుమతించింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఈ నెల 21వ తేదీన జరిగిన నీరజ్ హత్య కేసులో షాహినాయత్ గంజ్ పోలీసులు 7గురిని అరెస్ట్ చేశారు. 22వ తేదీన నలుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో విజయ్, సంజయ్, రోహిత్, మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. అభినందన్, మహేష్ పరారీలో ఉండటంతో మరుసటి రోజు వాళ్లిద్దరితో పాటు మరో మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 22వ తేదీన అరెస్ట్ చేసిన నలుగురిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరినా... హత్యతో నేరుగా సంబంధం ఉన్న విజయ్, సంజయ్‌లను మాత్రమే కస్టడీకి అనుమతించింది.
ఈ ఇద్దరినీ ప్రశ్నించి హత్యకు గల కారణాలను పూర్తిగా తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హత్యతో ఇంకెవరికైనా సంబంధం ఉందా అనే విషయాలపై నిందితులను ప్రశ్నిస్తున్నారు. 22వ తేదీన అరెస్ట్ చేసిన అభినందన్, మహేష్, ప్రశాంత్‌లను కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. కోర్టు అనుమతిస్తే వీళ్లను కస్టడీలోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించనున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నీరజ్.. సంజన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కులాంతర వివాహం కావడంతో పెళ్లి ఇష్టంలేని సంజన సమీప బంధువులు... పగ పెంచుకున్నారు. చంపుతామని గత ఆర్నెళ్లుగా బెదిరిస్తున్నట్లు సంజన, నీరజ్ కలిసి అఫ్జల్‌గంజ్ పీఎస్‌లోనూ ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదని సంజన ఆరోపించారు. నీరజ్‌ను హత్య చేయాలని ఎప్పుడు కుట్ర పన్నారనే విషయాలను సైతం పోలీసులు తెలుసుకోనున్నారు.
సంబంధిత కథనాలు : నవ్వుతూ కళ్లెదురుగా తిరగడాన్ని చూసి తట్టుకోలేకే హత్య..