కలియుగ వైకుంఠనాథుని సేవలో భక్తజనం తరించేందుకు ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానం మరో అవకాశం కల్పించింది. సుప్రభాత సేవలో శ్రీవారికి సమర్పించే తొలి నైవేద్యమైన వెన్నను భక్తులే చిలికేలా నవనీతసేవ ఆరంభించింది.
భక్తులే తయారు చేసేలా ఏర్పాట్లు..
తిరుమల శ్రీవారిని నిత్యం సుప్రభాతంతో మేల్కొలిపి తొలి నైవేద్యంగా వెన్న సమర్పించటం ఆనవాయితీ. గతంలో వివిధ గోవుల నుంచి సేకరించిన పాలతో కృత్రిమ పద్ధతుల్లో వెన్న తయారు చేసేవారు. గత నాలుగు నెలలుగా శ్రీవారికి... ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో నైవేద్యం సమర్పిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం... తొలి నైవేద్యం నవనీతాన్ని దేశవాలీ గోవులతో సంప్రదాయబద్ధంగా తయారుచేయాలని నిర్ణయం తీసుకుంది. గుజరాత్ నుంచి... 25 గిర్‌జాతి గోవులను తీసుకొచ్చి... వాటి పాలతో వెన్నను తయారుచేసేందుకు ఏర్పాట్లు చేసింది.
శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు..
సంప్రదాయ పద్ధతిలో వెన్న సేకరించే విధానాన్ని కొన్ని రోజులుగా.. ప్రయోగాత్మకంగా పరిశీలించిన తితిదే... శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని నవనీత సేవ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. గోశాలలో శ్రీకృష్ణుడికి పూజలు చేసిన అనంతరం.. సంప్రదాయ పద్ధతులతో సేకరించిన వెన్నను ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్,ఈవో ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులకు... నవనీతం సమర్పించారు. మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఊరేగింపులో... శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో చిన్నారులు సందడి చేశారు.
కిలో 12 గ్రాముల బరువు ఉన్న వెండి గిన్నె..
పాల సేకరణ మొదలుకుని చిలకటం దాకా పూర్తిగా సంప్రదాయ పద్ధతులకు పెద్ద పీట వేస్తూ ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు. నవనీత సేవలో వెన్న తీసుకెళ్లి స్వామివారికి సమర్పించేందుకు... కిలో 12 గ్రాముల బరువు ఉన్న వెండి గిన్నెను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్‌రెడ్డి... విరాళంగా అందజేశారు.
ఇదీ చూడండి: